T20 League: క్రిస్‌గేల్‌ వన్‌ మ్యాన్ షోలు.. సిక్సర్ల పిడుగులు గుర్తున్నాయా?

వెస్టిండీస్‌ సుడిగేల్‌.. క్రిస్‌గేల్‌ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు గుండె దడే. దొరికిన బంతిని దొరికినట్టు చితకబాదుతాడనే...

Updated : 26 Mar 2022 18:09 IST

వెస్టిండీస్‌ సుడిగేల్‌.. క్రిస్‌గేల్‌ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు గుండె దడే. దొరికిన బంతిని దొరికినట్టు చితకబాదుతాడనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో మైదానంలోని ఫీల్డర్ల మాదిరే స్కోరు బోర్డును కూడా పరుగులు పెట్టిస్తాడు. టీ20 లీగ్‌లోనూ గేల్‌ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (357) బాదిన ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. మరికొద్దిరోజుల్లో 15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకూ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు ఎవరు.. ఎప్పుడు ఎలా రాణించారో ఓసారి తెలుసుకుందాం.

ఎవరూ ఊహించని ఇన్నింగ్స్‌..

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్‌ టాప్‌లో ఉన్నాడు. అతడు 2011-17 మధ్య బెంగళూరు తరఫున ఆడినప్పుడు మూడు సార్లు ఈ ఘనతలు సాధించాడు. తొలిసారి 2013లో పుణెతో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగులు సాధించి ఎవరూ ఊహించని ఇన్నింగ్స్‌ ఆడాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పీడకల మిగిల్చాడు. దీంతో లీగ్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో పాటు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

తొలి మ్యాచ్‌లోనే చెదరని ముద్ర..

ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మాజీ ప్లేయర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ రెండోస్థానంలో ఉన్నాడు. అతడు లీగ్‌ ఆరంభ సీజన్‌ 2008లో బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా వచ్చి దంచికొట్టాడు. 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 2013లో క్రిస్‌గేల్‌ 17 సిక్సులు సాధించినంత వరకూ ఇది టాప్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌గా నిలిచింది.

గేల్ అంతకుముందే ఒకసారి..

ఇక క్రిస్‌గేల్‌ 2013 కన్నా ముందే ఒకసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఈ జాబితాలో రెండోసారి తన పేరును లిఖించుకున్నాడు. 2012లో దిల్లీ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో ఈ బెంగళూరు ఓపెనర్‌ 62 బంతుల్లోనే 128 పరుగులు సాధించాడు. అప్పుడు 7 ఫోర్లు, 13 సిక్సులు బాదాడు. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో మూడో స్థానం సంపాదించుకున్నాడు.

కోహ్లీతో జోడీ కట్టిన డివిలియర్స్‌..

బెంగళూరు మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు 2016లో గుజరాత్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో 52 బంతుల్లోనే 129 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాదడం విశేషం. ఇదే ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ (109; 55 బంతుల్లో 5x4, 8x6) సైతం దంచికొట్టాడు.

గేల్‌ మూడోసారి..

మరోసారి ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్‌గేల్‌ చోటు సంపాదించుకున్నాడు. 2015లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 పరుగులు సాధించి మరోసారి శతకంతో మెరిశాడు. అప్పుడు 57 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదడం గమనార్హం. దీంతో ఈ జాబితాలో ఐదో స్థానంలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇలా టాప్‌-5లో మూడు స్థానాలు ఒక్కడే సంపాదించడం విశేషం.

ఆ నలుగురిలో గేల్‌ ఒక్కడు..

ఈ జాబితాలో ఆండ్రూ రస్సెల్‌, సనత్‌ జయసూర్య, మురళీ విజయ్‌, క్రిస్‌గేల్‌ వరుసగా ఒకే మ్యాచ్‌లో  11 సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. రసెల్‌ 2018లో చెన్నైపై 88 పరుగులు, జయసూర్య 2008లో చెన్నైపై 114 పరుగులు, మురళీ విజయ్‌ 2010లో రాజస్థాన్‌పై 127 పరుగులు, క్రిస్‌గేల్‌ 2018లో సన్‌రైజర్స్‌పై 104 పరుగులు సాధించి ఆ రికార్డులను నెలకొల్పారు.

పొలార్డ్‌, శ్రేయస్‌, గిల్‌క్రిస్ట్‌..

మరో వైపు ఒకే మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో కీరన్‌ పొలార్డ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. పొలార్డ్‌ 2019లో పంజాబ్‌పై 83 పరుగులు, శ్రేయస్‌ 2018లో కోల్‌కతాపై 93, గిల్‌క్రిస్ట్‌ 2008లో ముంబయిపై 109 పరుగులు సాధించారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని