Tokyo Olympics: పావురాలను అప్పుడు చంపేశారు.. ఇప్పుడు ఎగరేస్తున్నారు.. !

నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడ ఒలింపిక్స్‌ను ఆతిథ్య దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో పావురాలను గాల్లోకి వదిలేయడం గమనించే ఉంటారు కదా..! క్రీడలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతి చిహ్నామైన పావురాలను గాల్లోకి వదులుతారు. కానీ, ఒలింపిక్స్‌ తొలినాళ్లలో

Published : 27 Jul 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడ ఒలింపిక్స్‌ను ఆతిథ్య దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో పావురాలను గాల్లోకి వదిలేయడం గమనించే ఉంటారు కదా..! క్రీడలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతికి చిహ్నమైన పావురాలను గాల్లోకి వదులుతారు. కానీ, ఒలింపిక్స్‌ తొలినాళ్లలో ఆ పావురాలను చంపేసే షూటింగ్‌ విభాగం ఒకటి ఉండేదన్న విషయం తెలుసా? ఎక్కువ సంఖ్యలో పావురాలను చంపిన వారిని విజేతలుగా ప్రకటించేవారు. 

ఆధునిక ఒలింపిక్స్‌లో కాలనుగుణంగా ఎన్నో క్రీడలు భాగమయ్యాయి. విమర్శలు, కష్టతర నిర్వహణలతో మరికొన్ని కనుమరుగయ్యాయి. అలా ఒలింపిక్స్‌ క్రీడల్లో నుంచి తొలగించిన క్రీడే లైవ్‌ పీజియన్‌ షూటింగ్‌. ప్రస్తుతం అథ్లెట్లు ఆడుతున్న స్కీట్‌ షూటింగ్‌.. ఒకప్పటి పీజియన్‌ షూటింగ్‌ నుంచి వచ్చిందే. ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిసారి కాబట్టి కొన్ని క్రీడలను ఎంపిక చేసి వాటిలో పోటీ నిర్వహించారు. ఆ తర్వాత 1900లో ఫ్రాన్స్‌లో జరిగిన రెండో ఒలింపిక్స్‌లో ఈ లైవ్‌ పీజియన్‌ షూటింగ్‌ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో క్రీడాకారులు ఎగురుతున్న పావురాలను చంపాల్సి ఉంటుంది. అలా ఎన్ని పావురాలను చంపితే అన్ని పాయింట్లు లభిస్తాయి. ఎక్కువ పావురాలను చంపినవారు విజేతలవుతారు.  

లైవ్‌ పీజియన్‌ షూటింగ్‌లో సెంటెనరీ గ్రాండ్‌ ప్రైజ్‌.. 1900 వరల్డ్‌ ఎక్స్‌పో గ్రాండ్‌ ప్రైజ్‌ రెండు రకాల పోటీలు ఉండేవి. సెంటెనరీ గ్రాండ్‌ ప్రైజ్‌ 1900 జూన్‌ 19న నిర్వహించారు. అందులో 166 మంది పాల్గొన్నారు. 1900 వరల్డ్‌ ఎక్స్‌పో గ్రాండ్‌ ప్రైజ్‌ జూన్‌ 25, 26, 27తేదీల్లో నిర్వహించగా.. 54 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

అథ్లెట్‌కు 27 మీటర్ల దూరంలో నిర్వాహకులు పావురాలను గాల్లోకి ఎగరేసేవారు. నిర్ణీత సమయంలో ఆ పావురాలను తుపాకీ గురి పెట్టి చంపాలి. తొలి ఆరు పావురాల్లో రెండింటిని మిస్‌ చేస్తే ఆ క్రీడాకారులు పోటీ నుంచి ఎలిమినేట్‌ అవుతాడు. అలా ఈ ఆటలో దాదాపు 300 పావురాలు బలయ్యాయి. ఈ పోటీల్లో సెంటెనరీ గ్రాండ్‌ ప్రైజ్‌ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్‌ మ్యాకింతోష్‌ 22 పావురాలను చంపి అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్‌ అథ్లెట్‌ 21 పావురాలను, మూడోస్థానంలో నిలిచిన యూఎస్‌ఏ అథ్లెట్‌ 19 పావురాలను చంపారు. ఇక 1900 వరల్డ్‌ ఎక్స్‌పో గ్రాండ్‌ ప్రైజ్‌ విభాగంలో బెల్జియం అథ్లెట్‌ 21పావురాలని చంపి విజేతగా నిలవగా.. ఫ్రాన్స్‌ అథ్లెట్‌ 20, ఆస్ట్రేలియా అథ్లెట్‌ 18, యూఎస్‌ఏ అథ్లెట్‌ 18 పావురాలను చంపి వరుసగా 2,3,4 స్థానాలు దక్కించుకున్నారు. అయితే, విజేతలకు ఇచ్చిన 20వేల ఫ్రాంక్స్‌ను టాప్‌ 4 అథ్లెట్లు పంచుకున్నారు. 

అయితే, క్రీడల కోసం ప్రాణుల్ని బలిచేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఒలింపిక్స్‌ కమిటీ ఆ తర్వాత నుంచి ఈ క్రీడను నిలిపివేయాలని నిర్ణయించింది. అలా ఆ ఒక్క ఒలింపిక్స్‌లోనే పావురాలను చంపే క్రీడ ఉంది. ఆ తర్వాత నుంచి పావురాలకు బదులుగా.. రంగులు నింపిన బాల్స్‌ను ఉపయోగిస్తూ స్కీట్‌ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. 

జింకలను చంపడమూ ఆటే

1908 నుంచి 1924 మధ్య ఒలింపిక్స్‌లో 100 మీటర్స్‌ రన్నింగ్‌ డీర్‌ పోటీలు నిర్వహించారు. 100 మీటర్ల పిచ్‌పై జింక పరుగెడుతుంటే.. అథ్లెట్‌ నిర్ణీత దూరం నుంచి తుపాకీతో జింకను కాల్చాల్సి ఉంటుంది. సింగిల్‌ అండ్‌ డబుల్‌ షాట్‌ విభాగాలుగా ఈ క్రీడ ఉండేది. ఆ తర్వాత 1952, 1956 ఒలింపిక్స్‌లోనూ  ఈ ఆటను నిర్వహించారు. అనంతరం ఆటకు స్వస్తి చెప్పారు. కేవలం ఒలింపిక్స్‌లోనే కాదు.. ప్రపంచ షూటింగ్‌ పోటీల్లోనూ రన్నింగ్‌ డీర్‌ పోటీలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఆ ఆటే ప్రస్తుతం 100మీటర్ల షూటింగ్‌ విభాగంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని