Lovlina Borgohain: లవ్లీనా విసిరిన పంచ్‌కు ఊరి జాతకం మారింది..!

టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది లవ్లీనా బొర్గోహెన్. ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే.. మాజీ ప్రపంచ ఛాంపియన్‌పై ధాటిగా పంచ్‌లు విసిరి, మెప్పించింది. ఆ అద్భుత ప్రదర్శన ఆమె ఊరివాళ్ల జాతకాన్ని మార్చింది. అదేంటో చూద్దామా..!

Published : 03 Aug 2021 23:52 IST

దిస్‌పూర్: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది లవ్లీనా బొర్గోహెన్. ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే.. మాజీ ప్రపంచ ఛాంపియన్‌పై ధాటిగా పంచ్‌లు విసిరి, మెప్పించింది. ఆ అద్భుత ప్రదర్శన ఆమె ఊరివాళ్ల జాతకాన్ని మార్చింది. అదేంటో చూద్దామా..!

లవ్లీనాది అస్సాంలోని బారొముథియా గ్రామం. వానలొస్తే అక్కడి రహదార్లు దయనీయంగా మారతాయి. లవ్లీనా ఇంటికి చేరుకునే దారిది అదే పరిస్థితి. ఇప్పుడు ఆమెకు పతకం రావడం ఆ ఊరివాళ్ల జాతకాన్ని మార్చింది. లవ్లీనా ఇంటికి చేరుకునే 3.5 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులు మరమ్మతు చేస్తున్నారు. దాన్ని మెటల్ రోడ్డుగా మారుస్తున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్వజిత్ ఫుకాన్ చొరవ తీసుకున్నారు. 

‘ఇది లవ్లీనాకు మేం ఇస్తోన్న బహుమతి. ఆమె స్వర్ణ పతకంతో తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో, అరకొర సౌకర్యాల మధ్య నివసించే ఆడపిల్లలకు ఆమె స్ఫూర్తి. ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. అందుకు ముఖ్యమంత్రి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని విశ్వజిత్ వెల్లడించారు. అక్కడి స్థానికులు మాట్లాడుతూ..‘ఈ రోడ్డు బాగుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. లవ్లీనా స్వర్ణపతకంతో తిరిగిరావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆమె సెమీఫైనల్‌లోకి చేరుకోగానే.. ఇక్కడ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఆమెకు బహుమతిగా ఇస్తున్నారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.  

ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్‌ ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడారు. అయితే వారిద్దరికీ కాంస్యాలే దక్కాయి. 69 కేజీల విభాగంలో తొలి పతకం అందిస్తున్నది మాత్రం లవ్లీనానే. ఆమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు గెలిచింది.      

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని