పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?

‘క్రికెట్‌ విచిత్రమైన ఆట’.. ఈ మాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎందుకంటే మళ్లీ మళ్లీ అలా చెప్పుకొనే సందర్భాలు వస్తూనే ఉంటాయి. ఆస్ట్రేలియా, భారత్‌ గులాబి టెస్టు ఇందుకు మరో ఉదాహరణ. తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. రెండో రోజు టీమ్‌ఇండియా పట్టు...

Updated : 20 Dec 2020 06:31 IST

26, 36, 45, 47.. ఎవరి స్కోరు ఎంతో తెలుసా!

‘క్రికెట్‌ విచిత్రమైన ఆట’.. ఈ మాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎందుకంటే మళ్లీ మళ్లీ అలా చెప్పుకొనే సందర్భాలు వస్తూనే ఉంటాయి. ఆస్ట్రేలియా, భారత్‌ గులాబి టెస్టు ఇందుకు మరో ఉదాహరణ. తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. రెండో రోజు టీమ్‌ఇండియా పట్టు బిగించింది. మూడోరోజు అదే జట్టు 36 పరుగులకే పరిమితమై చెత్తగా ఓడింది. ఇలాంటి పరిస్థితి పసికూనలే కాదు మేటి జట్లూ ఎదుర్కొన్నాయి. పేరుకు పెద్ద జట్లే అయినా అవి చిన్న స్కోర్లు చేసిన తీరు ఆశ్చర్యమే మరి!


ఇంగ్లాండ్‌  ‘45’

ప్రపంచంలోనే అత్యధిక టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఇంగ్లాండ్‌ది. ఎందుకంటే ఈ ఆట పుట్టిందే అక్కడ కదా. 1877లో తొలి టెస్టు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు 1028 మ్యాచులు ఆడింది. 373 గెలిచి 306 ఓడింది. 349 డ్రా చేసుకుంది. ఇంగ్లిష్‌ జట్టు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో చేసిన అత్యల్ప స్కోరు 45. ఆస్ట్రేలియాతో 1887లో ఆడింది. జార్జ్‌ లోహ్‌మన్‌ (17) తప్ప మిగతా అందరూ ఒక అంకె స్కోరుకే పరిమితం అయ్యారు. 20వ శతాబ్దం విషయానికి వస్తే 1994లో వెస్టిండీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 46కే కుప్పకూలింది. సర్‌ కోర్ట్లీ ఆంబ్రోస్‌ 6/24 నిప్పులు చెరిగాడు. కోర్ట్నీ వాల్ష్‌ 3/16 అతడికి తోడయ్యాడు. ఇంగ్లాండ్‌లో అలెక్స్‌ స్టీవార్ట్‌ (18) తప్ప మరొకరు రెండంకెల స్కోరు చేయలేదు.


ఆసీస్‌ ‘36’

ఇంగ్లాండ్‌ తర్వాత అత్యధిక టెస్టులు ఆడింది ఆస్ట్రేలియా. ఇప్పటి వరకు 831 టెస్టులాడిన కంగారూలు 393 గెలిచి 225 ఓడారు. 211 డ్రా చేసుకున్నారు. భారీ స్కోర్లకు చిరునామా అయిన ఆసీస్‌ అత్యల్ప స్కోరు 36. ఇంగ్లాండ్‌తో 1936లో తలపడ్డప్పుడు జరిగింది. ఇంగ్లాండ్‌ 376/9కు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌ 7/17 విజృంభణతో ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. 20వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా చేతిలో రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులకే ఆలౌటైంది. మొదట ఆసీస్‌ 284 చేసింది. బదులుగా సఫారీలు 96కే కుప్పకూలారు. దాంతో ఆ జట్టు బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించారు. వెర్నాన్‌ ఫిలాండర్‌ 5/15, మోర్నీ మోర్కెల్‌ 3/9 చుక్కలు చూపించారు. పాంటింగ్‌, వాట్సన్‌, హ్యూస్‌, హస్సీ, హడిన్‌ ఉన్న ఆ జట్టులో నేథన్‌ లైయన్‌ (14)ది టాప్‌ స్కోరు.


విండీస్‌ ‘47’

1970వ దశకంలో వెస్టిండీస్‌ జట్టు పర్యటనకు వస్తోందంటే ఆతిథ్య దేశాలు వణికిపోయేవి. అలాంటి జట్టు చేసిన అత్యల్ప స్కోరు 47. కింగ్‌స్టన్‌ వేదికగా 2004లో ఇంగ్లాండ్‌తో తలపడ్డ టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట విండీస్‌ 311 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 339 చేసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కరీబియన్‌ జట్టును స్టీవ్‌ హార్మిసన్‌ 7/12, మాథ్యూ హొగ్గార్డ్‌ 2/21 దెబ్బకొట్టారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ సునాయసంగా విజయం అందుకుంది. కాగా విండీస్‌కు 550 టెస్టుల అనుభవం ఉంది. 175 గెలిచి 199 ఓడింది. మరో 175 డ్రా చేసుకుంది.


భారత్‌  ‘36’

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టెస్టులు ఆడిన నాలుగో జట్టు భారత్‌. 543 ఆడి 157 గెలిచింది. 168 ఓడింది. 217 డ్రా చేసుకుంది. కాగా సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు 36. ఆస్ట్రేలియాతో తలపడ్డ తొలి గులాబి మ్యాచులో (2020) ఇది జరిగింది. మొదట కోహ్లీసేన 244కు ఆలౌటైంది. ఆసీస్‌ 191కు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను జోస్‌ హేజిల్‌వుడ్‌ 5/8, పాట్‌ కమిన్స్‌ 4/21 కోలుకోలేని దెబ్బకొట్టి అత్యల్ప స్కోరుకు పరిమితం చేశారు. కాగా అంతకుముందు టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు 42. లార్డ్స్‌ వేదికగా 1974లో ఇంగ్లాండ్‌తో తలపడ్డప్పుడు జరిగింది.


కివీస్‌  ‘26’

400 పైచిలుకు టెస్టులు ఆడిన మరో జట్టు న్యూజిలాండ్‌. కాలక్రమంలో అద్భుతమైన టెస్టు ఆటగాళ్లను ఎందరినో అందించింది. 444 టెస్టులాడిన కివీస్‌ 103 గెలిచి 175 ఓడింది. 166 డ్రా చేసుకుంది. కాగా ఆ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు 26. టెస్టు చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఒక జట్టు చేసిన తక్కువ స్కోరు ఇదే. 1955లో ఇంగ్లాండ్‌ చేతిలో ఈ పరాభవం జరిగింది. మొదట కివీస్‌ 200 చేయగా ఇంగ్లాండ్‌ 246 చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బాబ్‌ ఆపిల్‌యార్డ్‌ 4/7, బ్రియన్‌ స్టాథమ్‌ 3/9, ఫ్రాంక్‌ టైసన్‌ 2/10 విజృంభించి కివీస్‌ను 26కే ఆలౌట్‌ చేశారు. ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో తమ జట్టుకు విజయం అందించారు. 20వ దశాబ్దం తర్వాత చూస్తే 2013లో దక్షిణాఫ్రికా చేతిలో 45కే ఆలౌటైంది.


దక్షిణాఫ్రికా ‘30’

సుదీర్ఘ ఫార్మాట్లో దక్షిణాఫ్రికాది విచిత్రమైన పరిస్థితి. వరుసగా నాలుగుసార్లు ఆ జట్టు అత్యల్ప స్కోర్లు నమోదు చేసింది. 1896, 1924లో ఇంగ్లాండ్‌ చేతిలో వరుసగా 30కే ఆలౌటైంది. మళ్లీ అదే జట్టు చేతిలో 1899లో 35కు పరాభవం ఎదుర్కొంది. 1932లో ఆసీస్‌ చేతిలో 36కు కుప్పకూలింది. 20వ శతాబ్దం తర్వాత చేసిన అత్యల్ప స్కోరు 73. గాలె వేదికగా 2018లో శ్రీలంక మ్యాచులో ఇది జరిగింది. 351 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో చేధనకు దిగిన సఫారీలను లంకేయులు విలవిల్లాడేలా చేశారు. దిల్రువాన్‌ పెరీరా 6/32, రంగనా హెరాత్‌ 3/38 దెబ్బకు ఎల్గర్‌, ఆమ్లా, బవుమా, డుప్లెసిస్‌ వంటి టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకు పరిమితం అయ్యారు. వెర్నాన్‌ ఫిలాండర్‌ చేసిన 22* అత్యధిక స్కోరు.


పాక్‌‌ ‘49’

ప్రపంచ మేటి జట్లను వణికించన దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి. అద్భుతమైన పేసర్లు, బ్యాట్స్‌మెన్‌ మీదకు దూసుకొచ్చే బంతులు విసిరే స్పీడ్‌స్టర్లకు ఒకప్పుడు అది చిరునామా. ఇప్పటి వరకు 431 టెస్టులు ఆడిన పాక్‌ 138 గెలిచి 131 ఓడింది. 162 మ్యాచులు డ్రా చేసుకుంది. టెస్టుల్లో దాని అత్యల్ప స్కోరు 49. జోహన్స్‌బర్గ్‌ వేదికగా 2013లో దక్షిణాఫ్రికా చేతిలో దానికి భంగపాటు ఎదురైంది. మొదట సఫారీలు 253 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 29.1 ఓవర్లకే 49కే కుప్పకూలింది. డేల్‌ స్టెయిన్‌ 6/8, ఫిలాండర్‌ 2/16, జాక్వెస్‌ కలిస్‌ 2/11 చురకత్తుల్లాంటి బంతులు విసిరారు. దాంతో అజహర్‌ అలీ (13), మిస్బాఉల్‌ హఖ్‌ (12) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు.


శ్రీలంక ‘71’

400+ టెస్టులాడిన దేశాలను మినహాయిస్తే అత్యల్ప స్కోరు చేసిన చిన్న జట్టు ఐర్లాండ్‌. 2019లో ఇంగ్లాండ్‌తో ఆఖరి ఇన్నింగ్స్‌లో 15.4 ఓవర్లకు 38 పరుగులే చేసింది. వందకు పైగా టెస్టులాడిన బంగ్లాదేశ్‌ అత్యల్ప స్కోరు 43. నార్త్‌సౌండ్‌ వేదికగా 2018లో వెస్టిండీస్‌‌తో జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 18.4 ఓవర్లకే చాపచుట్టేసింది. ఇక జింబాబ్వే అత్యల్ప స్కోరు 51. నేపియర్‌ వేదికగా 2012లో న్యూజిలాండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 28.5 ఓవర్లకు ఆలౌటైంది. 289 టెస్టులాడిన శ్రీలంక చేసిన స్వల్ప స్కోరు 71. క్యాండీ వేదికగా 1994లో పాక్‌తో జరిగిన పోరులో మొదటి ఇన్నింగ్స్‌లో 28.2 ఓవర్లకు కుప్పకూలింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి
ఆస్ట్రేలియా ఘన విజయం
భారత్‌‌ తప్పుకాదు..ఓటీపీని మరిచిపోవాలి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని