Mega Auction : మెగా వేలం.. కొత్త ఫ్రాంచైజీల వల ఎవరికో..?

మెగా వేలం సందడి షురూ అయింది. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు..

Updated : 29 Mar 2022 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 టోర్నీ మెగా వేలం సందడి షురూ అయింది. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటున్నా.. ప్రస్తుతం అందరి చూపు కొత్త టీమ్‌లపైనే ఉంది. ఇప్పటికే ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవడం పూర్తైంది. కోచ్‌తోపాటు సహాయక  సిబ్బందిని నియమించుకోవడమూ జరిగింది. ఇక కొత్త ఆటగాళ్ల ఎంపికపై జట్లు దృష్టిసారించాయి. మరి లక్‌నవూ, అహ్మదాబాద్‌ జట్లు ఎవరిని తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చనే విషయాలను ఓసారి పరిశీలిద్దామా..

లఖ్‌నవూ

పంజాబ్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్‌ను కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూ తమ కెప్టెన్‌గా నియమించుకుంది. రాహుల్‌ కోసం రూ. 17 కోట్లను వెచ్చించడం విశేషం. ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌, మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ వ్యవహరించనున్నారు. అలానే రాహుల్‌తోపాటు ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టొయినిస్ (రూ. 9.2 కోట్లు), కొత్త కుర్రాడు రవి బిష్ణోయ్‌ (రూ.4 కోట్లు)ను ఎంపిక చేసుకుంది. మెగా వేలంలో మిగతావారిని కొనుగోలు చేసుకునేందుకు రూ. 59 కోట్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఐదుగురి మీద భారీ మొత్తం పెట్టేందుకు వెనుకాడకపోవచ్చు.

* డేవిడ్ వార్నర్ : ఈ లెఫ్ట్‌ఆర్మ్‌ ఓపెనర్ క్రీజ్‌లో కుదురుకుంటే భయంకరంగా ఆడతాడు. హైదరాబాద్‌ రిటెయిన్‌ చేసుకోకపోవడంతో వార్నర్ మెగా వేలంలోకి వచ్చాడు. కోట్లు కుమ్మరించడానికి మిగతా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉన్న ఆటగాళ్లలో వార్నర్ ప్రథముడే అని చెప్పాలి. 

* క్వింటన్‌ డికాక్‌/ సురేశ్ రైనా: వీరిద్దరిలో ఒకరిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ముంబయి తరఫున క్వింటన్‌ డికాక్ చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే క్వింటన్‌ వైపు ముంబయి మొగ్గు చూపితే వేలం రసవత్తరంగా మారొచ్చు. అలానే సురేశ్ రైనా కూడా మంచి హిట్టరే. కాకపోతే గత సీజన్ల ఫామ్‌ను చూస్తే కొంచె కష్టమే అయినా.. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 

* మహమ్మద్‌ షమీ / అవేశ్‌ ఖాన్‌: ఇక బౌలర్ల విషయానికొస్తే.. గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సీనియర్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీని తీసుకోవడానికి కేఎల్‌ రాహుల్ మొగ్గు చూపే ఆస్కారం ఉంది. తన పంజాబ్‌ సహచరుడు కావడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే మార్కస్‌ స్టొయినిస్‌ రూపంలో మీడియం పేసర్‌ ఉన్నాడు. అతడికి తోడుగా యువ బౌలర్‌ అవేశ్ ఖాన్‌ను దక్కించుకోవడానికి లఖ్‌నవూ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు భువనేశ్వర్‌ కుమార్, శివమ్‌ మావి, కార్తిక్ త్యాగిలలో ఒకరిని తీసుకోవాలని లఖ్‌నవూ భావిస్తున్నట్లు సమాచారం.


గుజరాత్‌ టైటాన్స్‌ 

కొత్త ఫ్రాంచైజీల్లో గుజరాత్‌ ఒకటి. ప్రధాన కోచ్‌గా టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్ నెహ్రా, మెంటార్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌, డైరెక్టర్‌గా విక్రమ్‌ సోలంకీ వ్యవహరిస్తారు. గుజరాత్‌కు హార్దిక్‌ పాండ్య సారథ్యం వహిస్తాడు. పాండ్యతోపాటు రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఫ్రాంచైజీ తీసుకుంది. ఇంకా మిగతా ఆటగాళ్ల కోసం రూ.52 కోట్లను వెచ్చించనుంది. 

* డుప్లెసిస్‌: గత సీజన్‌లో చెన్నె టైటిల్‌ నెగ్గడంలో ఓపెనర్ డుప్లెసిస్‌ కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే డుప్లెసిస్‌ను చెన్నై రిటెయిన్‌ చేసుకోలేదు. దీంతో ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం ఖాయం. గుజరాత్‌ కూడా మంచి ఓపెనర్‌ స్థానం కోసం డుప్లెసిస్‌ను దక్కించుకోవాలని ఎదురు చూస్తోంది. 

* శ్రేయస్‌ అయ్యర్‌: మెగా వేలంలో డేవిడ్‌ వార్నర్‌ తర్వాత శ్రేయస్ అయ్యర్‌పైనే అందరి గురి. మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే అయ్యర్‌ 13వ సీజన్‌లో దిల్లీని సారథిగా ఫైనల్‌కు చేర్చిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలో గుజరాత్‌ కన్ను శ్రేయస్‌ మీద ఉండటం సహజమే. అయితే భారీ మొత్తం దక్కించుకునే వారిలో శ్రేయస్‌ ఒకడు కాబట్టి గుజరాత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

* షకిబ్‌ అల్ హసన్‌: సూపర్‌ ఆల్‌రౌండర్‌. ఇటు బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ రాణించగల అనుభవశాలి. బంగ్లా అత్యుత్తమ ఆటగాళ్లలో షకిబ్ ఒకడు. కీలక సమయాల్లో అవసరమైన పరుగులు చేయగలడు. వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలడు. ఇప్పటికే హార్దిక్‌ పాండ్య వంటి ఆల్‌రౌండర్‌కు మరొకరు తోడైతే గుజరాత్‌ పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు. 

* రవిచంద్రన్‌ అశ్విన్: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్. టాప్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా రాటుదేలాడు. ఇటీవల బ్యాటింగ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. మరోసారి దిల్లీ అశ్విన్‌ను దక్కించుకోవడానికి ముందుకు రావచ్చు. అదే క్రమంలో చెన్నై కూడానూ అశ్విన్‌ కోసం పోటీ పడే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని