
Lucknow vs Kolkata: కోల్‌కథ ముగిసె.. లఖ్‌నవూ ప్లేఆఫ్స్ చేరె
రేసు నుంచి నిష్క్రమించిన శ్రేయస్ సేన
డికాక్ మెరుపు సెంచరీ
రసవత్తర పోరులో లఖ్‌నవూ విజయం
నవీ ముంబయి
వారెవ్వా ఏం మ్యాచ్! ఇటు కోల్‌కతా... అటు లఖ్‌నవూ దంచుడే దంచుడు! రసవత్తరంగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో అభిమానులను ఉర్రూతలూగించింది. చివరికి లఖ్‌నవూనే విజేత అయినా.. కోల్‌కతా పోరాటమూ ఆకట్టుకుంది. డికాక్ విధ్వంసం, రాహుల్‌తో అతడి రికార్డు భాగస్వామ్యంతో మొదట లఖ్‌నవూ కొండంత స్కోరు చేస్తే.. కోల్‌కతా కూడా అంతే విధ్వంసంతో ఆ కొండను అందుకున్నంత పని చేసింది. ఆఖర్లో రింకూ, నరైన్ వీర విధ్వంసంతో గెలుపు అంచుల వరకు వెళ్లినా, త్రుటిలో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది. లఖ్‌నవూ తొమ్మిదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
హోరాహోరీ పోరులో లఖ్‌నవూ నిలిచింది. బుధవారం 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. ‘మ్యాన్ ఆ ద మ్యాచ్’ డికాక్ (140 నాటౌట్; 70 బంతుల్లో 10×4, 10×6), కేఎల్ రాహుల్ (68 నాటౌట్; 51 బంతుల్లో 3×4, 4×6) రికార్డుల మోత మోగించడంతో మొదట లఖ్‌నవూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా అద్భుతంగా పోరాడింది. శ్రేయస్ అయ్యర్ (50; 29 బంతుల్లో 4×4, 3×6) రింకూ సింగ్ (40; 15 బంతుల్లో 2×4, 4×6), నితీశ్ రాణా (42; 22 బంతుల్లో 9×4), బిల్లింగ్స్ (36; 24 బంతుల్లో 2×4, 3×6), నరైన్ (21 నాటౌట్; 7 బంతుల్లో 3×6) మెరవడంతో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. మోసిన్ ఖాన్ (3/20), స్టాయినిస్ (3/23) ఆ జట్టును దెబ్బతీశారు.
పోరాడిన కోల్‌కతా: అసలే కొండంత లక్ష్యం. ఆపై 9 పరుగులకే రెండు వికెట్లు. ఛేదన ఆరంభంలోనే కోల్‌కతాకు గట్టి దెబ్బ తగిలింది. అయినా ఆ జట్టు దీటుగా స్పందించింది. గట్టిగా పోరాడి లక్ష్యం దిశగా సాగింది. మోసిన్ ఖాన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ తోమర్ (4)ను ఔట్ చేశాక.. జత కలిసి నితీశ్ రాణా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధాటైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా చెలరేగి ఆడిన రాణా బౌండరీల మోత మోగించడంతో కోల్‌కతా ఏడు ఓవర్లకు 65/2తో నిలిచింది. తర్వాతి ఓవర్లో రాణా ఔటైనా.. అతడి స్థానంలో వచ్చిన బిల్లింగ్స్, శ్రేయస్ ఎడాపెడా దంచేస్తూ మంచి రన్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. శ్రేయస్ 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. 13 ఓవర్లలో 127/3తో చాలా బలంగా కనిపించింది కోల్‌కతా. లఖ్‌నవూకు కంగారు తప్పలేదు. కానీ ఆ జట్టు 11 పరుగుల వ్యవధిలో.. ప్రమాదకరంగా కనిపిస్తున్న బ్యాట్స్‌మెన్ ఇద్దరినీ ఔట్ చేసి ఊపిరిపీల్చుకుంది. 14వ ఓవర్లో శ్రేయస్‌ను ఔట్ చేసి లఖ్‌నవూకు స్టాయినిస్ ఉపశమనాన్నిస్తే.. 16వ ఓవర్లో బిల్లింగ్స్‌ను వెనక్కి పంపడం ద్వారా ఆ జట్టును బిష్ణోయ్ పైచేయిలో నిలిపాడు. కోల్‌కతా సాధించాల్సిన రన్‌రేట్ కూడా పెరిగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయినా హిట్టర్ రసెల్, రింకూ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరమే. కోల్‌కతా ఆశలతోనే ఉంది. కానీ 17వ ఓవర్లో రసెల్‌ను మోసిన్ ఖాన్ ఔట్ చేయడంతో ఆ ఆశలకు తెరపడ్డట్లే అనుకున్నారంతా! కానీ కథ అక్కడితో ముగియలేదు. సునీల్ నరైన్, రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్‌తో లఖ్‌నవూకు చెమటలు పట్టించారు. బంతిని కసిదీరా బాదేస్తూ తమ జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. మోసిన్ బౌలింగ్‌లో నరైన్ ఓ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత రింకూ, నరైన్.. అవేష్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లోనూ అదే చేశారు. దీంతో చివరి ఓవర్లో కోల్‌కతాకు 21 పరుగులు అవసరమయ్యాయి. స్టాయినిస్ తొలి నాలుగు బంతుల్లో రింకూ వరుసగా 4, 6, 6, 2 బాదడంతో మ్యాచ్ కోల్‌కతా వైపు తిరిగింది. చివరి రెండు బంతుల్లో మూడు చేయాల్సిన స్థితిలో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ వరుస బంతుల్లో రింకూ, ఉమేశ్‌ను ఔట్ చేసిన స్టాయినిస్ లఖ్‌నవూను సంబరాల్లో ముంచెత్తాడు. ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతిని ఆడిన రింకూ.. లూయిస్ పాయింట్ నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒంటి చేత్తో అందుకున్న క్యాచ్‌కు నిష్క్రమించాడు. యార్కర్‌కు ఉమేశ్ బౌల్డయ్యాడు.
డికాక్ దంచేశాడు..: పాపం... కోల్‌కతా బౌలర్లు! అంతకుముందు 20 ఓవర్లు శ్రమించినా ఒక్కటంటే ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయారు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డికాక్ ఆటే హైలైట్. ఆ జట్టు అంత మెరుగైన స్కోరు సాధించింది అంటే కారణం అతడే. నిజానికి వికెట్లు పోకున్నా ఓ దశ వరకు లఖ్‌నవూకు గొప్ప స్కోరేమీ లేదు. పరుగులు అంత వేగంగా రాలేదు. 9 ఓవర్లకు 68 చేసింది. డికాక్ బ్యాట్ ఝుళిపించినా.. మరో ఓపెనర్ రాహుల్ దూకుడుగా ఆడలేకపోయాడు. చక్కని షాట్లతో అలరించిన డికాక్.. ఉమేశ్, రసెల్ ఓవర్లలో సిక్స్‌లు కొట్టాడు. ఉమేశ్ బౌలింగ్‌లో రాహుల్ ఓ సిక్స్ కొట్టినా.. మొత్తంగా అతడి బ్యాటింగ్‌లో జోరు లేదు. ఎదుర్కొన్న తొలి 28 బంతుల్లో 28 పరుగులే చేశాడు. కానీ పదో ఓవర్లో. సౌథీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. ఒకటి డీప్ మిడ్వికెట్లో.. ఇంకోటి స్క్వేర్ లెగ్‌లో. అయితే ఆ దూకుడు కొనసాగలేదు. కానీ డికాక్ జోరు కొనసాగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే ఒక్క వికెట్టూ కోల్పోకున్నా.. 15 ఓవర్లలో 122 పరుగులే చేసిన లఖ్‌నవూ భారీ స్కోరు సాధించేలా కనపడలేదు. కానీ ఆఖర్లో పరుగుల వరద పారింది.
ఆకాశమే హద్దుగా..: ఓ వైపు నిలబడ్డ రాహుల్‌లో దూకుడు లోపించినా.. ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును నడిపించిన డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి కోల్‌కతా బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. అతడి తొలి 15 ఓవర్ల ఆట ఒక ఎత్తయితే.. చివరి అయిదు ఓవర్ల ఆట మరో ఎత్తు. చివరి అయిదు ఓవర్లలో లఖ్‌నవూ ఏకంగా 88 పరుగులు రాబడితే.. అందులో 71 డికాక్వే అంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అతడి ఆట హైలైట్స్‌ను తలపించింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ దంచిన అతడు.. రసెల్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టేశాడు. 19వ ఓవర్లో అతడి విధ్వంసం పరాకాష్టకు చేరింది. అతడు ఏకంగా నాలుగు సిక్స్‌లు దంచడంతో ఆ ఓవర్లో సౌథీ 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో రసెల్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 4 దంచాడు డికాక్. నిజానికి 18 ఓవర్లలో 164/0తో నిలవడంతో లఖ్‌నవూ ఒక్క వికెట్టూ కోల్పోకుండా ఆడి ఏం లాభం అనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 46 పరుగులు రాబట్టింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిజిత్ తోమర్ క్యాచ్ వదిలేయడంతో డికాక్ బతికిపోయాడు.
1
ఈ మెగా టీ20 క్రికెట్ లీగ్ చరిత్రలో మొత్తం 20 ఓవర్లూ బ్యాటింగ్ చేసిన తొలి ఓపెనింగ్ జంటగా డికాక్, రాహుల్ ఘనత సాధించారు.
210
డికాక్, రాహుల్ భాగస్వామ్యం. ఈ టోర్నీ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. బెయిర్‌స్టో-వార్నర్ రికార్డు (185) బద్దలైంది.
140
డికాక్ అజేయంగా సాధించిన పరుగులు. ఈ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గేల్ (175 నాటౌట్), మెక్‌కలమ్ (158 నాటౌట్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను పంచుకున్న బిల్ గేట్స్
-
India News
Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
-
Sports News
Virat Kohli: కోహ్లీ వైఫల్యాల వెనుక అదే కారణం..: మిస్బా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?