Updated : 02 May 2022 04:33 IST

Lucknow vs Delhi: లఖ్‌నవూ హ్యాట్రిక్‌

దిల్లీపై విజయం
మెరిసిన రాహుల్‌, మోసిన్‌

లఖ్‌నవూ అదరహో. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో వరుసగా మూడో విజయం సాధించిన ఆ జట్టు..ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. బ్యాటుతో కెప్టెన్‌ రాహుల్‌, బంతితో మోసిన్‌ ఖాన్‌ మెరిసిన వేళ దిల్లీని ఓడించింది. లఖ్‌నవూకు ఇది ఏడో విజయం. దిల్లీ అయిదో పరాజయాన్ని చవిచూసింది.

ముంబయి: ఈ సీజన్‌లో లఖ్‌నవూ అదిరే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఆదివారం 6 పరుగుల తేడాతో దిల్లీపై విజయం సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (77; 51 బంతుల్లో 4×4, 5×6), దీపక్‌ హుడా (52; 34 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో మొదట లఖ్‌నవూ 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేదనలో దిల్లీ 7 వికెట్లకు 189 పరుగులే చేయగలిగింది. పంత్‌ (44; 30 బంతుల్లో 7×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (42 నాటౌట్‌; 24 బంతుల్లో 1×4, 3×6), మిచెల్‌ మార్ష్‌ (37; 20 బంతుల్లో 3×4, 3×6) రోమన్‌ పావెల్‌ (35; 21 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. మోసిన్‌ ఖాన్‌ (4/16) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు

దిల్లీ తడబాటు: ఛేదనలో 13 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్‌ ఔటైనా.. మిచెల్‌ మార్ష్‌, పంత్‌ బ్యాట్‌ ఝళిపించడంతో దిల్లీ 7 ఓవర్లలో 73/2తో మెరుగ్గానే కనిపించింది. ఆ దశలో కొద్ది తేడాలో మార్ష్‌, లలిత్‌ వికెట్లు కోల్పోయింది. రోమన్‌ పావెల్‌తో కలిసి పంత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే 13వ ఓవర్లో పంత్‌ను మోసిన్‌ బౌల్డ్‌ చేయడంతో దిల్లీ ఆశలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అప్పటికి స్కోరు 120. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్న పావెల్‌తో పాటు శార్దూల్‌ను మోసిన్‌ 17వ ఓవర్లో ఔట్‌ చేశాడు. దిల్లీ చివరి మూడు ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌ లఖ్‌నవూ నియంత్రణలోకి వచ్చింది. అయితే కుల్‌దీప్‌తో కలిసి అక్షర్‌ను జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. దిల్లీ విజయానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కుల్‌దీప్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టి ఉత్కంఠ రేపాడు. కానీ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్‌ చేసిన స్టాయినిస్‌.. బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.

రాణించిన రాహుల్‌: సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ అంతకుముందు లఖ్‌నవూ కెప్టెన్‌ రాహుల్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. హుడా కూడా చెలరేగిపోవడంతో లఖ్‌నవూ భారీ స్కోరు సాధించింది. నిజానికి 195 కూడా అనుకున్న దాని కంటే కాస్త తక్కువ స్కోరే. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూకు మెరుపు ఆరంభం లభించింది. 4 ఓవర్లకు స్కోరు 41/0. చెలరేగి ఆడిన డికాక్‌ (23; 13 బంతుల్లో 3×4, 1×6) అయిదో ఓవర్లో నిష్క్రమించినా.. రాహుల్‌కు హుడా తోడు కావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఎడాపెడా బౌండరీలతో హుడానే ఎక్కువ దూకుడుగా ఆడాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన రాహుల్‌ కూడా క్రమంగా జోరందుకున్నాడు. రాహుల్‌ 35 బంతుల్లో, హుడా 32 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. 15వ ఓవర్లో హుడా ఔట్‌ కావడంతో 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడ్డా.. లఖ్‌నవూకు చింతించాల్సిందేమీ లేకపోయింది. అప్పటికి స్కోరు 137. అయితే బలమైన పునాది వేసుకున్న ఆ జట్టు ఆఖర్లో ఊహించినంత విధ్వంసాన్ని సృష్టించలేకపోయింది. చివరి అయిదు ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 50 పరుగులు రాబట్టింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts