LSG vs MI: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కొంప ముంచిన రనౌట్లు!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను ఓడించడంలో ముంబయి (LSG vs MI) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతోపాటు మరొక అంశం కీలక పాత్ర పోషించింది. అదే ముగ్గురు బ్యాటర్లు రనౌట్లు కావడం. ఇవే లఖ్‌నవూ ఓటమిని ఖరారు చేశాయి.

Published : 25 May 2023 12:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయానికి ఆకాశ్‌ మధ్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన ఒక కారణం అయితే.. రనౌట్లు మరో కారణం అని చెప్పాలి. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మొత్తంగా మూడు రనౌట్లు నమోదయ్యాయి. ఈ కారణంగానే ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటర్లు ఉన్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) 101 పరుగులకే అలౌటైంది. అయితే ఇదంతా లఖ్‌నవూ బ్యాటర్ల స్వయం కృతాపరాధం అనొచ్చు. కీలక సమయంలో వికెట్లు ఇచ్చేయడంతోపాటు.. అనవసర పరుగులకు పోయి రనౌట్లు అయ్యారు. ఆ రనౌట్లు జరిగాయిలా... 

  • కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌లో (11.5వ ఓవర్) మార్కస్‌ స్టాయినిస్‌ డీప్‌ మికెట్‌ మీదుగా బంతిని కొట్టాడు. దీపక్‌ హుడాతో కలిసి మార్కస్‌ స్టాయినిస్‌ తొలి పరుగును సునాయాసంగా తీశాడు. రెండో పరుగు కూడా ఈజీగానే వచ్చేది. కానీ, పరుగెత్తే క్రమంలో ఒకరినొకరు ఢీకొనడంతో స్టాయినిస్‌ నెమ్మదించాడు. అప్పటికే టిమ్‌ డేవిడ్‌ కీపర్‌ వైపు బంతిని విసరగా.. ఇషాన్‌ కిషన్‌ అమాంతం వికెట్లను గిరాటేశాడు.
  • స్టాయినిస్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కృష్ణప్ప గౌతమ్‌ (2) అనవసర పరుగుకు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. చావ్లా బౌలింగ్‌లో (12.3వ ఓవర్‌) గౌతమ్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వైపుగా బంతిని కొట్టాడు. అక్కడ గ్రీన్‌ అద్భుతంగా ఆపాడు. ఇక్కడే చిన్న డ్రామా జరిగింది. గ్రీన్‌ ఆ బంతిని కవర్స్‌లో ఉన్న రోహిత్‌ వైపు నెట్టాడు. మిస్‌ ఫీల్డ్‌ అనుకుని గౌతమ్‌ పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ, నాన్‌ స్ట్రయికర్‌ దీపక్ హుడా ఆసక్తి చూపింకచపోవడంతో వెనక్కి వెళ్లాడు. అయితే, ఈలోపు గ్రీన్‌ నుంచి బంతిని అందుకున్న రోహిత్ డైరెక్ట్‌గా వికెట్ల మీదకు విసరడంతో గౌతమ్‌ ఔటవ్వక తప్పలేదు. 
  • పై రెండు రనౌట్లలో భాగస్వామి అయిన దీపక్ హుడా కూడా రనౌట్‌గానే పెవిలియన్‌కు చేరడం గమనార్హం. ఆకాశ్‌ మధ్వాల్ వేసిన (14.5వ ఓవర్‌) బంతిని నవీనుల్‌ హక్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. కామెరూన్ గ్రీన్‌ అద్భుతంగా బంతిని ఆపాడు. నాన్‌ స్ట్రయికింగ్‌లో ఉన్న దీపక్ హుడా స్ట్రయికర్‌ ఎండ్‌ వైపు వచ్చేశాడు. ఈలోపు నవీనుల్‌ హక్‌ కాస్త ముందుకొచ్చి తిరిగి క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ సమయంలో గ్రీన్‌ విసిరిన బంతిని బౌలర్ మధ్వాల్ అందుకొని నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌ వైపు ఉన్న రోహిత్‌కు అందించాడు. హిట్‌ మ్యాన్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వికెట్లను పడగొట్టడంతో దీపక్‌ హుడా నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసి 183 పరుగులను లఖ్‌నవూకు లక్ష్యంగా నిర్దేశించింది. కీలక సమయంలో వికెట్లు పడినప్పటికీ.. క్రీజ్‌లో స్టాయినిస్‌ (40), దీపక్‌ హుడా (15) ఉండటంతో లఖ్‌నవూ విజయంపై నమ్మకంగానే ఉంది. చివరి పది ఓవర్లలో 108 పరుగులు చేయాల్సి ఉన్నా లఖ్‌నవూ బెదరలేదు. కానీ రనౌట్లు లఖ్‌నవూ కోలుకోనీయకుండా చేశాయి. దీంతో 81 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అలా రెండో క్వాలిఫయర్‌కి వెళ్దాం అనుకున్న లఖ్‌నవూ ఆశలు ఆవిరైపోయాయి. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు