KKR vs LSG: రింకు పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లిన లఖ్‌నవూ

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Updated : 21 May 2023 00:00 IST

కోల్‌కతా:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఈ గెలుపుతో (17 పాయింట్లు) లఖ్‌నవూ ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (45; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం ఇవ్వడంతో కోల్‌కతా సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే, లఖ్‌నవూ బౌలర్లు అనుహ్యంగా పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించారు. 

చివర్లో రింకు సింగ్ (67; 33 బంతులలో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాటంతో మ్యాచ్‌ ఉత్కంఠభరింతంగా మారింది. చివరి రెండు ఓవర్లలో కేకేఆర్ విజయానికి 41 పరుగులు అవసరం అయ్యాయి. నవీనుల్ హక్‌ వేసిన 19వ ఓవర్‌లో రింకు సింగ్ చెలరేగిపోయాడు. మొదటి మూడు బంతులకు మూడు ఫోర్లు బాదేశాడు. తర్వాతి బంతికి సింగిల్ తీసి ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో విజయ సమీకరణం 21 పరుగులుగా మారింది. మొదటి బంతికి వైభవ్‌ అరోరా సింగిల్‌ తీసి రింకు సింగ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. చివరి మూడు బంతుల్లో రింకు రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో కోల్‌కతా 175 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవవూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28; 27 బంతుల్లో), ప్రేరక్ మన్కడ్ (26; 20 బంతుల్లో), ఆయుష్‌ బదోని (25; 21 బంతుల్లో) ఫర్వాలేదనిపించగా.. చివర్లో నికోలస్ పూరన్ (58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్‌ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు