MUMBAI vs MP : మధ్యప్రదేశ్‌ జోరు

రంజీ ట్రోఫీ అందుకోవాలనే దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికే దిశగా మధ్యప్రదేశ్‌ సాగుతోంది. తొలి టైటిల్‌తో కల సాకారం చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. దేశవాళీ దిగ్గజం ముంబయితో ఫైనల్‌ మ్యాచ్‌పై ఆ జట్టు పట్టు బిగించింది.

Updated : 25 Jun 2022 07:00 IST

రంజీ టైటిల్‌ దిశగా అడుగులు

యశ్‌, శుభమ్‌ శతకాలు

బెంగళూరు: రంజీ ట్రోఫీ అందుకోవాలనే దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికే దిశగా మధ్యప్రదేశ్‌ సాగుతోంది. తొలి టైటిల్‌తో కల సాకారం చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. దేశవాళీ దిగ్గజం ముంబయితో ఫైనల్‌ మ్యాచ్‌పై ఆ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా ఆ జట్టు అడుగులు వేస్తోంది. డ్రా మ్యాచ్‌ అయ్యే అవకాశాలే కనిపిస్తుండటంతో ముంబయికి అవకాశం లేనట్లే. యశ్‌ దూబె (133; 336 బంతుల్లో 144), శుభమ్‌ శర్మ (116; 215 బంతుల్లో 154, 16) శతకాలతో సత్తాచాటి మధ్యప్రదేశ్‌కు ఆధిపత్యాన్ని చలాయించే అవకాశాన్ని అందించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 123/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు.. వీళ్ల శతకాల సాయంతో 368/3తో మూడో రోజు ఆట ముగించింది. ప్రస్తుతానికి ముంబయి తొలి ఇన్నింగ్స్‌ స్కోరు (374) కంటే మధ్యప్రదేశ్‌ కేవలం 6 పరుగులే వెనకబడి ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న రజత పటీదర్‌ (67 బ్యాటింగ్‌; 106 బంతుల్లో 134)కు తోడు కెప్టెన్‌ ఆదిత్య (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉండడంతో ఆ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి.. మ్యాచ్‌ డ్రా చేసుకున్నా ఆ జట్టుకే గెలుపు దక్కుతుంది. మూడో రోజు ఆటలో యశ్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 44), శుభమ్‌ (ఓవర్‌ నైట్‌ స్కోరు 41) ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశారు. ఏ ఒక్క ముంబయి బౌలర్‌ కూడా వీళ్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. అలవోకగా బౌండరీలు బాది స్కోరుబోర్డును నడిపించిన ఈ జోడీ ఏ దశలోనూ తడబడ్డట్లు కనిపించలేదు. ఫీల్డర్లు మాటలతో రెచ్చగొట్టినా.. బౌలర్లు కవ్వించినా ఏకాగ్రత చెదరకుండా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే శతకాలు అందుకున్నారు. రెండో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. శుభమ్‌ను అవస్తి (1/53) ఔట్‌ చేసినప్పటికీ ఆ జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అందుకు కారణం రజత్‌. యశ్‌తో కలిసి అతను మూడో వికెట్‌కు 72 పరుగుల జతచేశాడు.

సంక్షిప్త స్కోర్లు.. ముంబయి తొలి ఇన్నింగ్స్‌: 374; మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 368/3 (యశ్‌ దూబె 133, శుభమ్‌ శర్మ 116, రజత్‌ పటీదర్‌ 67 బ్యాటింగ్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని