Mahela Jayawardene: ఇషాన్‌తో మాట్లాడలేదు.. ఇదికాదు మేం ఆశించేది: జయవర్దనె

ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ గతకొద్ది రోజులుగా బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడుతున్నాడని, ఈ విషయంపై అతడితో ఇంకా చర్చించలేదని...

Published : 26 Apr 2022 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ గతకొద్ది రోజులుగా బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడుతున్నాడని, ఈ విషయంపై అతడితో ఇంకా చర్చించలేదని ఆ జట్టు ప్రధాన కోచ్‌ మహేలా జయవర్దనె అన్నాడు. ఈ సీజన్‌కు ముందు మెగా వేలంలో ముంబయి జట్టు అతడిని రూ.15.25 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేయగా అందుకు న్యాయం చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో 81, రెండో మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన అతడు తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా గతరాత్రి లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో 20 బంతులాడి కేవలం 8 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం వర్చువల్‌గా విలేకర్లతో మాట్లాడిన జయవర్దనె ఇలా చెప్పుకొచ్చాడు.

‘ఇషాన్‌ ఈ సీజన్‌ ఆరంభంలో మెరిసినా.. గత నాలుగు మ్యాచ్‌ల్లో సరిగ్గా ఆడలేక ఇబ్బందులు పడుతుండటాన్ని మనం చూశాం. ఈ మ్యాచ్‌ తర్వాత అతడు ఎలా ఆడాలానుకుంటున్నాడు.. ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలపై నేను ఇప్పటివరకు అతడితో మాట్లాడలేదు. అతడు పూర్తి స్వేచ్ఛగా తన సహజసిద్ధమైన ఆట ఆడేందుకు అవకాశం ఇచ్చాం. కానీ, గతకొన్ని రోజులుగా అలా ఆడలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ బాగా ఆడినా అతడెందుకు ఇబ్బంది పడ్డాడో తెలుసుకోవాలి. ఇప్పుడు అదే విషయంపై చర్చిస్తా. ఏదేమైనా అతడి నుంచి టాప్‌ఆర్డర్‌లో మేం ఆశించేది ఇది కాదు’ అని పేర్కొన్నాడు. కాగా, లఖ్‌నవూతో ఓటమిపాలవ్వడంతో ఇక ముంబయి  ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ జట్టు సాధించే ఫలితాలు ఇతర జట్లపై ప్రభావం చూపుతాయి. మరి లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ముంబయి ఎలాంటి స్థితిలో ఉంటుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని