Sachin - Arjun: దెబ్బ తగిలాక అర్జున్‌ మాట.. సచిన్‌ను గుర్తు చేసింది: యోగ్‌రాజ్‌

కెరీర్‌ తొలినాళ్లలోనే ఆటతో, క్రికెట్‌ పట్ల అంకితభావంతో ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నాడు సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar). అందులో ఒకటి ‘మై ఖేలేగా’ (Main Khelega). ఇదే మాట సచిన్‌ తనయుడు అర్జున్‌ (Arjun Tendulkar) నోట కూడా వచ్చిందట. 

Published : 22 Dec 2022 01:59 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: లెజండరీ బ్యాటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గోవా తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టిన 23 ఏళ్ల అర్జున్‌ రాజస్థాన్‌తో తన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత మాజీ పేసర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌.. అర్జున్‌కు  కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శిక్షణ సమయంలో అర్జున్‌తో తన అనుభవాలను పంచుకున్నారు యోగ్‌రాజ్‌ సింగ్. అలాగే అర్జున్‌ సంకల్ప బలాన్ని, ఆటపట్ల చూపిస్తున్నఅంకితభావాన్ని మెచ్చుకున్నారు. 

సచిన్‌ అభ్యర్థన మేరకు అర్జున్‌కు శిక్షణ ఇవ్వడానికి స్టార్‌ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి, మాజీ పేసర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్‌కు ఆయన మెలకువలు నేర్పించారు. ఈ నేపథ్యంంలో అర్జున్‌ గురించి అసక్తికర విషయాలను యోగ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శిక్షణ సమయంలో అర్జున్‌ నుంచి ఎదురైన ఒక సంఘటన తనకు సచిన్‌ను గుర్తు చేసిందని వెల్లడించారు. 

ట్రైనింగ్‌ సెషన్‌లో బంతి వేగంగా వచ్చి అర్జున్‌ గడ్డానికి బలంగా తాకింది. దీంతో ముఖం బాగా వాచిపోయి, రక్తం కారడం మొదలైంది. అయినా, అర్జున్‌ విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించలేదట. ఆటను కొనసాగించడానికే మొగ్గుచూపాడని యోగ్‌రాజ్‌ తెలిపారు. ‘‘అర్జున్‌కు బంతి తగిలి గాయమవ్వడంతో.. ఐస్‌ పెట్టుకొని,  విశ్రాంతి తీసుకో అని చెప్పాను. అయితే అతను మాత్రం.. ‘మై ఖేలేగా’ (నేను ఆడతాను) అంటూ ఆట కొనసాగించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ సమయంలో నాకు సచిన్‌ గుర్తొచ్చాడు. కెరీర్‌ తొలి రోజుల్లో ఓసారి సచిన్‌ ఇలానే అని ఆట కొనసాగించాడు’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు యోగ్‌రాజ్‌ సింగ్‌. 

‘‘ఆ రోజు అర్జున్‌ మాటలు విని.. వెంటనే కౌగిలించుకొని డాక్టర్‌ దగ్గరకు వెళ్లమన్నాను. ఎందుకంటే అప్పటికే అర్జున్‌ ముఖం చాలా వాచింది. అయితే మరుసటి రోజే అతను శిక్షణకు హాజరయ్యాడు. అలా ఆట విషయంలో అతని సంకల్పబలం నాకు నచ్చింది’’ అని యోగ్‌రాజ్‌ మెచ్చుకున్నారు. దాంతోపాటు అర్జున్‌కు యోగ్‌రాజ్‌ ఓ సందేశం కూడా ఇచ్చారు. ‘‘అర్జున్‌..నువ్వు నీ సొంత దారిలో నడవాలి. అప్పుడే  నువ్వు విజయం సాధించగలవు. ప్రజలూ నిన్ను గుర్తిస్తారు’’ అని  చెప్పారు. 

1989 నాటి ఘటన అదీ...

సచిన్ గురించి యోగ్‌రాజ్‌ చెప్పిన సంఘటన 1989లో జరిగింది. పాకిస్థాన్‌తో సచిన్‌ తొలి టెస్టు సిరీస్‌ ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సియోల్‌కోట్‌లో జరిగిన నాలుగో టెస్టులో వకార్‌ యూనిస్‌ వేసిన బౌన్సర్‌ కారణంగా సచిన్‌ ముక్కుకు గాయమైంది.  అయినప్పటికీ సచిన్‌ తన ఆటను కొనసాగించాడు. భారత్‌ను గెలిపించడానికి తనవంతు కృషి చేశాడు. అప్పుడు గాయంతో సచిన్‌ అన్న మాటలు ‘మై ఖేలేగా’ (నేను ఆడతాను) ప్రసిద్ధి చెందాయి. క్రికెట్‌ చరిత్రలో భాగమయ్యాయి. ఇప్పుడు అవే మాటలు తనయుడు నోటి నుంచి వినడం కాకతాళీయం కావొచ్చు కానీ.. తండ్రి బాటలో తనయుడు సాగుతున్నాడు అని చెప్పకనే చెబుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని