Gautam Gambhir: ‘నిన్న తప్పించుకున్నావు’.. పాక్‌ నుంచి గంభీర్‌కు బెదిరింపులు..!

మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌పై పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గంభీర్‌కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్‌ఐఎస్‌, కశ్మీర్‌’ పేరుతో

Published : 26 Nov 2021 01:48 IST

వెల్లడించిన దిల్లీ పోలీసు వర్గాలు

దిల్లీ: మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. గంభీర్‌కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్‌ఐఎస్‌, కశ్మీర్‌’ పేరుతో వచ్చిన ఈ-మెయిళ్లను పాక్‌ నుంచే పంపించారని దిల్లీ పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. దర్యాప్తులో ఆ ఈ-మెయిళ్ల సోర్స్‌ పాక్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. 

గంభీర్‌ అధికారిక మెయిల్‌ ఐడీకి 24 గంటల వ్యవధిలో రెండు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. ‘‘గంభీర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టబోతున్నాం’’ అని ఆ ఈ-మెయిల్‌లో ఉండటంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గూగుల్‌ను సంప్రదించారు. ఈ-మెయిళ్లు పంపిన ఖాతాదారు వివరాలు, ఐడీ, ఐపీ అడ్రసు వంటి  సమాచారం తెలియజేయాలని కోరారు. గూగుల్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఈ-మెయిళ్లను పాక్‌ నుంచి ఓ కాలేజీ విద్యార్థి వీటిని పంపినట్లు తెలిసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించాయి.

మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గంభీర్‌ మెయిల్‌ ఐడీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ మెయిల్‌ వచ్చింది. తిరిగి బుధవారం మధ్యాహ్నం అదే ఐడీ నుంచి మరో ఈ-మెయిల్‌ వచ్చింది. రెండో దానిలో గంభీర్‌ ఇంటికి సంబంధించిన ఓ వీడియోను పంపించారు. ‘‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న తప్పించుకున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లయితే రాజకీయాలకు, కశ్మీర్‌ అంశానికి దూరంగా ఉండు’’ అని రెండో మెయిల్‌లో గంభీర్‌ను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గంభీర్‌కు వ్యక్తిగతంగాను, దిల్లీలోని ఆయన ఇంటివద్ద భద్రతను పెంచారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని