Maldives: మాల్దీవుల్లో సంబరాలు చేసుకోండి.. భారత క్రికెట్‌ జట్టుకు ఆహ్వానం

టీ20 ప్రపంచకప్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు మాల్దీవులను సందర్శించాలని భారత క్రికెట్‌ జట్టుకు అక్కడి పర్యటక సంస్థలు ఆహ్వానం పలికాయి.

Published : 08 Jul 2024 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు ఇక్కడి నుంచి పర్యటకం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యటక సంస్థలు.. భారతీయులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత క్రికెట్‌ జట్టు (Indian Cricket Team)ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. ప్రపంచకప్‌ విజయోత్సవాన్ని మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసుకుని, మరపురాని క్షణాలను సొంతం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పలికాయి.

మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (ఎంఏటీఐ), మాల్దీవులు మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్‌ (ఎంఎంపీఆర్‌సీ)లు సంయుక్తంగా ఓ ప్రకటనలో ఈమేరకు ఆహ్వానం పలికాయి. ‘‘ఇరుదేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక.. సాంస్కృతిక, క్రీడా సంబంధాలు ఉన్నాయి. భారత క్రికెట్ జట్టును స్వాగతించడం, వారి విజయోత్సవంలో పాలుపంచుకోవడం మాల్దీవులకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని ఎంఎంపీఆర్‌సీ సీఈవో, ఎండీ ఇబ్రహీం షియురీ, ఎంఏటీఐ సెక్రటరీ జనరల్ అహ్మద్ నజీర్ తెలిపారు.

రిలేషన్‌షిప్‌ను బయటపెట్టిన స్మృతీ మంధాన.. ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

ఇటీవల బార్బడోస్‌ వేదికగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది కాస్త ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేక మంది భారతీయులు.. ఆ దేశ టూర్‌ ప్లాన్‌ను విరమించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని