రూట్‌ కట్టడికి సరికొత్త వ్యూహం

ఉపఖండం పిచ్‌లపై స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు జో రూట్‌. చివరగా ఆడిన మూడు టెస్టుల్లో రెండు ద్విశతకాలు, ఒక శతకం బాదేశాడు. చెపాక్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన పోరు అతడి కెరీర్లో వందో టెస్టు. అందులో రెండు వందలకు పైగా పరుగులు చేశాడు. జట్టుకు భారీ విజయం అందించి....

Published : 12 Feb 2021 01:09 IST

సిద్ధం చేసిన క్రికెటర్‌ మనోజ్‌ తివారీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉపఖండం పిచ్‌లపై స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు జో రూట్‌. చివరగా ఆడిన మూడు టెస్టుల్లో రెండు ద్విశతకాలు, ఒక శతకం బాదేశాడు. చెపాక్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన పోరు అతడి కెరీర్లో వందో టెస్టు. అందులో రెండు వందలకు పైగా పరుగులు చేశాడు. జట్టుకు భారీ విజయం అందించి అద్వితీయ సందర్భంగా మలుచుకున్నాడు. దాదాపుగా రెండు రోజులు బ్యాటింగ్‌ చేసిన అతడిని ఔట్‌ చేసేందుకు భారత బౌలర్లు విపరీతంగా కష్టపడ్డారు. చివరికి అతడు ఔటైనా పరుగులు మాత్రం భారీగా చేశాడు.

సాధారణంగా విదేశీ ఆటగాళ్లు భారత్‌లో స్పిన్‌ను ఆడేందుకు జంకుతారు. ప్రమాదకర ప్రాంతంలో ఆడుతూ త్వరగా ఔటైపోతుంటారు. జోరూట్‌ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు. బంతి లెంగ్త్‌ను పక్కాగా అంచనా వేస్తూ స్పిన్‌లో పరుగులు చేస్తున్నాడు. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ ఆడుతూ కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. అతడిని ఔట్‌ చేసేందుకు టీమ్‌ఇండియా ఎన్నో ప్రణాళికలు అమలు చేసిన ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో క్రికెటర్‌ మనోజ్‌ తివారీ ఒక వ్యూహంతో ముందుకొచ్చాడు. ట్విటర్లో దానిని పోస్ట్‌ చేశాడు.

వాషింగ్టన్‌ సుందర్‌, అశ్విన్‌ బౌలింగ్‌లో రూట్‌ ఆడుతున్నప్పుడు ఫీల్డర్లను ఎలా మోహరించాలో తివారీ సూచించాడు. ఆన్‌సైడ్‌ 7/2 ఫార్ములా ప్రతిపాదించాడు. ఇది స్పిన్‌ పిచ్‌లపై మాత్రమే పని చేస్తుందని స్లిప్‌లో క్యాచులు పట్టేందుకు ఎవరూ అవసరం లేదని పేర్కొన్నాడు. అతడి ఉద్దేశం ప్రకారం ఒకరు షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ ప్రాంతంలో ఉండాలి. ఎందుకంటే రూట్‌ రివర్స్‌స్వీప్‌ చేస్తే క్యాచులు అందుకుంటాడు. పరుగులు రాకుండా చూసుకుంటాడు. మిడాఫ్‌లో ఒకరిని ఉంచాలి. లెగ్‌ స్లిప్‌, షార్ట్‌ లెగ్, షార్ట్‌ మిడ్‌వికెట్‌లో ఒక్కొక్కర్ని ఉంచాలి. వీరు క్యాచులు అందుకొనేందుకు కృషి చేయాలి. పరుగులను నియంత్రించేందుకు మిడాన్‌లో ఒకరు ఉండాలి.

రూట్‌ స్వీప్‌ షాట్‌ ఎక్కువగా ఆడకుండా ఉండేందుకు డీప్‌ స్క్వీర్‌ లెగ్‌లో ఒకరిని మోహరించాలి. బౌండరీ సరిహద్దుకు 20 గజాల ముందు ఉండాలి. షార్ట్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఒకరు ఉండాలి. స్వీప్ షాట్‌ ఆడినప్పుడు ఇక్కడ క్యాచులు వస్తాయి. పరుగులని నియంత్రించొచ్చు. సాధారణ షాట్లు ఆడకుండా డీప్‌ మిడ్‌వికెట్లో ఒకరిని పెట్టాలి. ఇక బౌలర్‌, వికెట్‌ కీపర్‌ వారి వారి స్థానాలో ఉంటారన్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
అడగ్గానే నటరాజన్‌ను ఇచ్చారు
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని