ఇంకెంత కాలం భయపడతాం?  

ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఇంకెంత కాలం భయపడాలని, ఎప్పుడో ఒకప్పుడు ఆ వైరస్‌ను దాటి ముందడుగు వేయాల్సి ఉంటుందని భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ అభిప్రాయపడింది...

Published : 23 Feb 2021 12:03 IST

కరోనాను దాటి ముందుకు సాగాలి

దిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఇంకెంత కాలం భయపడాలని, ఎప్పుడో ఒకప్పుడు ఆ వైరస్‌ను దాటి ముందడుగు వేయాల్సి ఉంటుందని భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ అభిప్రాయపడింది. ఏడాది విరామం తర్వాత తొలి బాక్సింగ్‌ టోర్నీలో పాల్గొనబోతున్న ఈ ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌.. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి మునుపటి బలం అందుకున్నానని వెల్లడించింది. ‘‘కరోనా నేపథ్యంలో ప్రయాణం చేయడానికి ఇంతకుముందు భయపడ్డా. ఇప్పటికీ ఎంతో జాగ్రత్తతో ఉన్నా. కానీ ఇంకెంత కాలం ఇలా కరోనాకు భయపడుతూ ఉండాలి. ఏదో ఒక సమయంలో దీనికి ముగింపు పలకాలి. ఆ వైరస్‌ నా దరికి చేరకుండా మాస్కు ధరించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూనే ఉన్నా’’ అని మేరీ తెలిపింది. వచ్చే నెల 1న స్పెయిన్‌లో ఆరంభం కానున్న బాక్సమ్‌ అంతర్జాతీయ టోర్నీలో ఈ 37 ఏళ్ల బాక్సర్‌ బరిలో దిగనుంది. నిరుడు ఆసియా అర్హత టోర్నీలో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న తర్వాత ఆమె తలపడబోతున్న తొలి ఛాంపియన్‌షిప్‌ ఇదే.

‘‘ఇప్పడు నా శరీర స్థితి బాగుంది. అందరిలాగే 2020 నాకూ కఠినంగానే గడిచింది. డిసెంబర్‌లో డెంగ్యూ రావడంతో శక్తిని కోల్పోయా. బరువూ పెరిగా. గత నెలలో 59 కేజీల వరకూ ఉన్నా. కానీ ఆ తర్వాత 15 రోజుల శిక్షణలో శ్రమించి తిరిగి నా మునుపటి బరువుకు చేరుకున్నా. ఇప్పుడు నేను 52 కేజీల వరకూ ఉన్నా. కండరాలు కూడా బలపడ్డాయి. బెంగళూరులో శిక్షణ శిబిరం నిర్వహించడం మేలు చేసింది. అన్ని ఆరోగ్య ప్రమాణాల నడుమ సాధన కొనసాగింది’’ అని మేరీ చెప్పింది. వైరస్‌ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) రద్దు చేయడంతో.. ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లు మాత్రమే ఆ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఐఓసీ టాస్క్‌ఫోర్స్‌ అథ్లెట్‌ రాయబారి అయిన మేరీ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న సవాళ్ల కారణంగానే ఆ టోర్నీని రద్దుచేశారు. ఒకవేళ ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించినా ఎలాంటి మార్పు ఉండేది కాదు. ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లు అదృష్టవంతులు. ఈ ఏడాది టోక్యోలో జరిగే ఆ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై దృష్టి సారించా’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని