T20 League:‘మా జట్టు ఫైనల్‌ చేరినా నేను సంతోషంగా లేను’

టీ20 లీగ్‌పై గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్‌ చేరినా సంతోషంగా లేనని వేడ్‌ పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్‌ చాలా చిరాకు కలిగిస్తోందన్నాడు.

Published : 29 May 2022 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌పై గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్‌ చేరినా సంతోషంగా లేనని వేడ్‌ పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్‌ చాలా చిరాకు కలిగిస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో గుజరాత్, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. అరంగేట్ర సీజన్‌లోనే మేటి జట్లను మట్టికరిపించి ఏకంగా ఫైనల్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది గుజరాత్‌ జట్టు. 

‘ఈ సీజన్‌ వ్యక్తిగతంగా నాకు చికాకు తెప్పిస్తోంది. బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నా. రాజస్థాన్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసేంత వరకు నాది చెత్త బ్యాటింగ్‌ లాగానే కనిపించింది.  టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్‌ చేయడం ఆనందం కలిగించింది. ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్‌ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్‌ నుంచి నాకు మంచి సపోర్ట్‌ ఉంది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది. రషీద్‌ ఖాన్‌ రూపంలో ఏడో నెంబర్‌ వరకు విధ్వంసకర బ్యాటింగ్‌ మాకు ఉండటం అదృష్టం. ఈసారి కప్‌ గుజరాత్‌దే’ అని మాథ్యూ వేడ్‌ అన్నాడు. 

ఆస్ట్రేలియా సీనియర్‌ క్రికెటర్‌ అయిన మాథ్యూ వేడ్‌ 11 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 లీగ్‌లో అడుగుపెట్టాడు. 2011లో దిల్లీకి ప్రాతినిధ్యం వహించిన వేడ్.. ఇప్పటివరకు టీ20 లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 171 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో చేసిన 35 పరుగులే అతడి అత్యధిక స్కోరు కావడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని