IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు.. మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపు

ఇంగ్లాండ్‌తో కీలకమైన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమ్‌ఇండియా తరఫున ఎవరు ఓపెనింగ్‌ చేస్తారనేది ఆసక్తిగా మారింది...

Updated : 27 Jun 2022 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో కీలకమైన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమ్‌ఇండియా తరఫున ఎవరు ఓపెనింగ్‌ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కాగా, తాజాగా రోహిత్‌ శర్మ సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో జులై 1 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఎవరు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. మరోవైపు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ ఇప్పటికే జట్టుతో ఉండగా.. మరో ఓపెనర్ కోసం జట్టు ఎదురుచూస్తోంది.

అయితే, ఈ టెస్టు మ్యాచ్‌ కోసం ఇంతకుముందే సెలెక్టర్లు మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయగా అతడిని జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు పంపలేదు. అవసరమైతేనే అతడిని పంపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ వైరస్‌ బారిన పడటంతో మ్యాచ్‌ ప్రారంభమయ్యే నాటికి కోలుకుంటాడో లేదో తెలియని పరిస్థితి. దీంతో ఎందుకైనా మంచిదని భావించి ముందు జాగ్రత్తగా మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పంపించారు. సోమవారం ఉదయం అతడు భారత్‌ నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లాడు. సాయంత్రానికల్లా జట్టుతో కలవనున్నాడు. మరోవైపు ఈ పర్యటనలో బయోబబుల్‌ నిబంధనలు లేకపోవడంతో మయాంక్‌ క్వారంటైన్‌లో ఉండకుండానే నేరుగా జట్టుతో కలుస్తాడు. అవసరమైతే ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఆడేందుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

అగర్వాల్‌ చివరిసారి మార్చిలో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అందులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 59 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన భారత టీ20 లీగ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమయ్యాడు. అయితే ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు అతడు ఎంపికైనా తుది జట్టులో ఆడించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే గిల్ మొదటి ఓపెనర్‌గా దాదాపు ఖాయమయ్యాడు. మరో ఓపెనింగ్‌ స్థానం కోసం లీసెస్టర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించిన శ్రీకర్‌ భరత్‌ అందుబాటులో ఉన్నాడు. అలాగే పుజారాకు గతంలో ఓపెనింగ్‌ చేసిన అనుభవం కూడా ఉంది. హనుమ విహారి సైతం రేసులో ఉన్నాడు. కాగా, టీమ్‌ఇండియా గతేడాది ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు వెళ్లగా 4 మ్యాచ్‌లు పూర్తయ్యాక 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టుకు ముందు కరోనా కేసులు నమోదవ్వడంతో వాయిదా పడింది. ఆ మ్యాచ్‌నే ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని