ICC : ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌’గా మయాంక్ అగర్వాల్ నామినేట్.!

టీమ్‌ఇండియా ఓపెనింగ్ బ్యాటర్‌ మయాంక్ అగర్వాల్‌ను ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ గా నామినేట్ చేసింది. అతడితో పాటు న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్, ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్...

Published : 08 Jan 2022 23:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా ఓపెనింగ్ బ్యాటర్‌ మయాంక్ అగర్వాల్‌ను ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ గా నామినేట్ చేసింది. అతడితో పాటు న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్, ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌లను కూడా ఐసీసీ అవార్డు కోసం నామినేట్ చేసింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఐసీసీ వీరిని ఎంపిక చేసింది.

గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. మయాంక్‌ అగర్వాల్‌కి తుది జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మయాంక్‌ అగర్వాల్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఓ శతకం, ఓ అర్థ శతకంతో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా మయాంక్ (60) అర్థ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇదిలా ఉండగా, న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య వాంఖడే మైదానంలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. పది వికెట్ల ప్రదర్శన చేసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన కివీస్‌ బౌలర్ అజాజ్‌ పటేల్ కూడా ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌’ రేసులో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అజాజ్‌ ఒకే టెస్టులో 16.07 సగటులో 14 వికెట్లు పడగొట్టడం గమనార్హం.

మరోవైపు, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్‌ యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఆల్ రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఆ మూడు టెస్టుల్లో కలిపి స్టార్క్‌ 19.64 సగటుతో 14 వికెట్లు, 58.50 సగటుతో 117 పరుగులు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని