Updated : 09 Apr 2022 11:38 IST

Mayank Agarwal: ఇది చాలా కష్టమైన మ్యాచ్‌.. అయినా పోరాడాం: మయాంక్

(Photos: Mayank Agarwal, Hardik Pandya Instagram)

ముంబయి: గుజరాత్‌తో తలపడిన పోరులో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డా ఫలితం లేకపోయిందని పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. గతరాత్రి బ్రబౌర్న్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ ఆఖరి బంతికి ఛేదించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ తెవాతియా (13 నాటౌట్‌; 3 బంతుల్లో 2x6) ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి గుజరాత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన మయాంక్‌ ఇలా స్పందించాడు.

‘ఇది చాలా కష్టమైన మ్యాచ్‌. మేం విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాం. ఇంకో 5-7 పరుగులు చేయాల్సింది. అయినా, గుజరాత్‌ ఆరంభంలో ధాటిగా ఆడినా.. తర్వాత మేం పుంజుకున్నాం. బ్యాటింగ్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయినా 189 పరుగులు సాధించామంటే గొప్పగా ఆడాం. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాం. మా బౌలర్లు అర్ష్‌దీప్‌, రబాడా అత్యుత్తమ బౌలింగ్‌ చేశారు. మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు విజయపుటంచుల దాకా తీసుకెళ్లారు. అయితే, చివరి ఓవర్‌లో ఫలితం ఇరు జట్లకూ సమానంగా మారింది. గుజరాత్‌ గెలుపొందినా చివరి ఓవర్‌ వేసిన ఒడియన్‌కు మేం అండగా ఉంటాం. అతడికి వందశాతం మద్దతిస్తాం. ఈ ఓటమి జీర్ణించుకోవడం కష్టమే అయినా.. మేం తిరిగి పుంజుకుంటాం’ అని అగర్వాల్‌ చెప్పుకొచ్చాడు.

నేను న్యూట్రల్‌గా మారా: హార్దిక్‌

ఇక గుజరాత్‌ సారథి హార్దిక్‌ పాండ్య మాట్లాడుతూ.. ఆటలో గెలుపోటములు సహజమేనని చెప్పాడు. తాను ఇప్పుడు న్యూట్రల్‌గా ఉన్నానని, గెలుపోటములతో సంబంధం లేదని చెప్పాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. ‘చివర్లో రాహుల్‌ తెవాతియా చాలా గొప్పగా ఆడాడు. అతడికి హ్యాట్సాఫ్‌. ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో అలా వెళ్లి ఒత్తిడిని జయించి బ్యాటింగ్‌ చేయడం గొప్ప విశేషం. నిజం చెప్పాలంటే ఇది పంజాబ్‌ మ్యాచ్‌. వాళ్లు ఓటమిపాలవ్వడం నాకు బాధగా ఉంది. మా బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ చాలా మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సాయికి క్రెడిట్‌ ఇవ్వాలి. అతడు గిల్‌తో నెలకొల్పిన భాగస్వామ్యం అమూల్యమైనది. ఆ భాగస్వామ్యమే మమ్మల్ని చివరివరకూ మ్యాచ్‌లో నిలబెట్టింది. నా విషయానికి వస్తే.. ప్రతి మ్యాచ్‌కూ మెరుగవుతున్నా. అయితే, పూర్తిగా నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేక అలసిపోతున్నా’ అని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని