Published : 27 Jul 2021 01:42 IST

Bhavani Devi: నా ఫెన్సింగ్‌ కిట్‌ కోసం.. అమ్మ నగలమ్మింది

కష్టాల కడలిని ఈది ఒలింపిక్స్ వేదికపైకి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫెన్సింగ్‌.. ఇలాంటి ఓ క్రీడ ఉందని చాలా మంది భారతీయులకు తెలియదు. కానీ ఆ క్రీడను ఎంచుకొని ముందుకు సాగింది తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్‌ భవానీ దేవి. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. దేశం ఇప్పుడు ఆమె వైపు చూస్తోంది. రెండో రౌండ్లో ఓటమిపాలైనా భవానీ ఇప్పుడు ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయం.

యాదృచ్ఛికంగానే ఈ ఆటను ఎంచుకున్నా.. అందులో రాణించేందుకు ప్రాణం పెట్టినట్లు తెలిపింది భవానీ. ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించినా తనను ఎవరూ గుర్తించలేదని.. తాను పడ్డ కష్టాలకు ఇప్పుడు గుర్తింపు లభిస్తోందని పేర్కొంది. ‘నా 11వ ఏట.. పాఠశాలలో జరగబోతున్న క్రీడా పోటీల్లో భాగంగా ఏదైనా ఓ క్రీడను ఎన్నుకోవాలని చెప్పారు. అయితే ఫెన్సింగ్‌ను కేవలం ఒకే ఒక్కరు ఎంచుకొన్నారు. ఇదేదో ప్రత్యేకంగా ఉంది కదా అని నేను దాన్నే ఎంచుకొన్నా’ అని ఈ క్రీడలో తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చింది.తన తల్లిదండ్రులు వెన్నంటే నిలిచారని పేర్కొంది. ‘మా అమ్మ తన నగలమ్మి రూ.6 వేలతో నాకు మొట్టమొదటి ఫెన్సింగ్‌ కిట్‌ను కొనిచ్చింది. విదేశాల్లో పోటీ పడేందుకు నాకు స్పాన్సర్‌షిప్‌ ఇప్పించేందుకు నా తల్లిదండ్రులు పలువురు అధికారుల ఇళ్లముందు గంటల కొద్దీ నిరీక్షించేవారు. ఫెన్సింగ్‌లో సరైన గురువు లేక, కుటుంబం ఆర్థికంగా చితికిపోవడాన్ని చూసి కుంగిపోయా. ఆటలో వెనకబడ్డా. కానీ ఓ టోర్నీ వేదికగా నాకు గురువు లభించారు. శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు’ అని తెలిపింది. ఆ గురువు సాయంతోనే అండర్‌-17 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించినట్లు పేర్కొంది.

అయినప్పటికీ భవానీని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే వచ్చాయి. తీసుకున్న రూ. 10 లక్షల లోన్‌ డబ్బులు శిక్షణలో ఖర్చయిపోయాయి. దీంతో కొద్ది రోజులపాటు ఆమె ఆటకు దూరంగా ఉంది. కానీ భవానీపై వాళ్ల అమ్మ నమ్మకం కోల్పోలేదు. తెలిసిన వారి వద్ద అప్పు చేస్తూ కుమార్తె శిక్షణ కోసం ఖర్చు చేసింది. దీంతో మళ్లీ శిక్షణ ప్రారంభించిన దేవి ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఈ క్రీడల్లో మొట్టమొదటి పతకం సాధించిన భారతీయురాలు భవానీనే. అయినప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదని.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయని ఈ ఫెన్సర్‌ చెప్పుకొచ్చింది.

‘విదేశాల్లో జరుగుతున్న ఓ టోర్నీలో పాలుపంచుకునేందుకు నా తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండగా.. సాయమందించాలని అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు ఓ లేఖ రాశాను. దానికి స్పందించిన ఆమె.. ఇంటికొచ్చి తనను కలవాలని, నాకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. దీంతో ఎట్టకేలకు నాకు అదృష్టం కలిసొచ్చిందని సంతోషించా. ఎన్నో పరీక్షలు, ట్రయల్స్‌ అనంతరం.. ఈ ఏడాది నాకు ఓ శుభవార్త అందింది. అదే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం’ అని భవానీ సంతోషం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందడంతో.. రూ.10 లక్షల లోన్‌ను తిరిగి చెల్లించానని, దీంతో తన తల్లిదండ్రుల మీద భారం తగ్గించానని వెల్లడించింది. ప్రస్తుతం ఓ ఇంటిని కొనేందుకు సన్నాహాలు చేస్తున్నానని, ఇల్లు కొని తన తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేస్తానని చెప్పింది.

టోక్యో ఒలింపిక్స్‌ తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన భవానీ దేవీ రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌తో పోరాడి వెనుదిరిగింది. ఆ ఓటమి అనంతరం ఆమె ఓ ట్వీట్‌ చేసింది. తొలి రౌండ్లో 15/3 తేడాతో అద్భుత విజయం సాధించానని, రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ చేతిలో 7/15తో ఓటమి పాలైనట్లు తెలిపింది. ‘నా శక్తిసామర్థ్యాలమేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి..  ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతా’ అని పేర్కొంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని