Rebecca Downie: 12ఏళ్ల బాలిక.. క్రికెట్‌ జట్టు జెర్సీని డిజైన్‌ చేసింది

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపర్చింది స్కాట్లాండ్‌ జట్టు. అయితే అంతకంటే ప్రత్యేకమైన మరో విషయం

Published : 20 Oct 2021 17:18 IST

Photo: Cricket Scotland Twitter

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపర్చింది స్కాట్లాండ్‌ జట్టు. అయితే అంతకంటే ప్రత్యేకమైన మరో విషయం ఆ జట్టు ధరించిన జెర్సీ. అందులో అంత విశేషం ఏముంది అంటారా..? అది నిజంగా స్పెషలే. ఎందుకంటే ఆ జెర్సీని డిజైన్‌ చేసింది మల్టీమిలియన్‌ బ్రాండెడ్‌ సంస్థలేవీ కాదు. 12 ఏళ్ల బాలిక. ప్రపంచకప్‌ కోసం స్కాట్లాండ్‌ ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీని రూపొందించింది పన్నెండేళ్ల రెబెకా డౌమీ. 

ప్రపంచ కప్‌లో కొత్త జెర్సీతో పాల్గొనాలని స్కాట్లాండ్ జట్టు భావించింది. అయితే దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలన్న ఆలోచనతో ఈసారి విద్యార్థులకు అవకాశం కల్పించింది. జెర్సీ డిజైన్‌ కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్‌ విద్యార్థులను ఆహ్వానించింది. దీనికి మంచి స్పందన లభించింది. మొత్తం 200 మంది విద్యార్థులు తమ డిజైన్లను పంపించారు. వీటిలో హాడింగ్టన్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల రెబెకా డౌనీ పంపించిన డిజైన్‌ విజేతగా నిలిచింది. ఆమె డిజైన్‌ చేసిన ఊదా రంగు జెర్సీ స్కాట్లాండ్‌ జట్టు యాజమాన్యానికి ఎంతగానో నచ్చింది. ఆ దేశ జాతీయ చిహ్నం ‘ది థిస్టిల్‌’ రంగులైన ముదురు నీలం, పర్పుల్‌ రంగులతో రెబెకా ఈ జెర్సీని రూపొందించింది. స్కాట్లాండ్‌ జట్టు ప్రపంచకప్‌ పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు రెబెకా చేతుల మీదుగానే ఈ జెర్సీలను జట్టు ఆటగాళ్లకు అందజేశారు. 

అంతేనా.. రెబెకా డిజైన్‌ చేసిన జెర్సీ ఇప్పుడా జట్టుకు లక్కీ ఛార్మ్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జెర్సీ ధరించి తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్‌ టీం.. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపైనా విజయం సాధించింది. దీంతో సూపర్‌ 12 అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడిస్తే.. స్కాట్లాండ్‌ సూపర్‌ 12కు చేరుకుంటుంది. 

ఈ సందర్భంగా స్కాట్లాండ్‌ జట్టు ట్విటర్‌ వేదికగా రెబెకాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఫొటోను పంచుకుంది. ‘‘స్కాట్లాండ్‌ కిట్‌ డిజైనర్‌. 12ఏళ్ల రెబెకా డౌనీ. ఆమె తాను డిజైన్‌ చేసిన డ్రెస్‌ ధరించి మా తొలి మ్యాచ్‌ను వీక్షించింది. థాంక్యూ రెబెకా’’ అని రాసుకొచ్చింది. జెర్సీ కాంపిటీషన్‌లో విజయం సాధించడంపై రెబెకా  ఆనందం వ్యక్తం చేసింది. ‘‘నేను గెలిచానంటే నమ్మలేకపోయా. రియల్‌ లైఫ్‌లో నా జెర్సీ చూసినందుకు ఆనందంగా ఉంది. జట్టును కలవడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్‌కప్‌లో మా టీం ఆడే ప్రతి మ్యాచ్‌ సమయంలోనూ ఈ జెర్సీ ధరించి వాళ్లను ఉత్సాహపరుస్తాను’’ అని చెప్పుకొచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని