Updated : 29 Mar 2022 17:11 IST

Mega Auction: ఈ ఆటగాళ్లకు ఎందుకంత ధర?

ప్రపంచంలో ఎన్ని క్రికెట్‌ లీగులు ఉన్నా భారత్‌లోని దేశవాళీ టీ20 టోర్నీకి ఉండే క్రేజే వేరు. ఏటా ఆటగాళ్ల వేలం నుంచి టోర్నీ పూర్తయ్యేవరకు అద్భుతమైన ఆదరణ కలిగిన నంబర్‌ వన్‌ ఈవెంట్‌గా దీనికి గుర్తింపు ఉంది. అది డబ్బు పరంగా అయినా, ఆటగాళ్లకు దక్కే ఫేమ్‌ పరంగా చూసినా దీనికి మరే లీగ్‌ సాటిరాదు. అలాంటి టోర్నీలో రాబోయే సీజన్‌కు జరిగిన మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు ఊహించని ధర పలికారు. అందులో ఎవరున్నారో.. వారికి అంత మొత్తం ఎందుకు దక్కిందో తెలుసుకుందాం.

వయసుతో పాటు టాలెంట్‌..

ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్‌ కిషన్‌ రికార్డు నెలకొల్పాడు. ముంబయి అనూహ్యంగా రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన టీమ్‌ఇండియా రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇదివరకు యువరాజ్‌ సింగ్‌ను దిల్లీ టీమ్‌ అత్యధికంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2018లో ముంబయి రూ.6.4 కోట్లకు ఇషాన్‌ను కొనుగోలు చేయగా ఈసారి భారీ మొత్తం వెచ్చించడానికీ కారణాలు లేకపోలేదు. అతడి వయసు ఇప్పుడు 23 ఏళ్లు ఉండగా.. గతకొన్నేళ్లుగా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా రాణిస్తున్నాడు. దూకుడు కలిగిన బ్యాట్స్‌మన్‌ కావడంతో పాటు వయస్సులో చిన్నవాడు కావడంతో ఇషాన్‌ను తీసుకోడానికి ముంబయి సిద్ధపడింది. దీంతో అతడిని భవిష్యత్‌ నాయకుడిగానూ తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది.

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌..

ఈ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు దీపక్‌ చాహర్. అతడిని వదిలేసుకున్న చెన్నై జట్టే తిరిగి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 2016, 17 సీజన్లలో పుణె జట్టు తరఫున ధోనీ సారథ్యంలోనే ఆడిన చాహర్‌ 2018లో రూ.80లక్షలకు చెన్నై గూటికి చేరాడు. దీంతో అప్పటి నుంచి ఆ జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, చాహర్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీసే బౌలర్‌ మాత్రమే కాకుండా లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేసే సత్తా కూడా ఉన్న ఆటగాడు. అందువల్లే చెన్నై టీమ్‌ చాహర్‌ను వేలంలో పోటీ పడి కొనుగోలు చేసింది. కాగా, రూ.2 కోట్ల కనీస ధరతో మెగా వేలంలో అడుగుపెట్టిన చాహర్‌ను సొంతం చేసుకోడానికి హైదరాబాద్‌, దిల్లీ జట్లు తొలుత ఆసక్తి చూపాయి. అతడి కోసం పోటాపోటీ నెలకొనగా రూ.10 కోట్ల ధర దాటగానే చెన్నై వేలంలోకి వచ్చింది. దీంతో చివరికి అతడిని సొంతం చేసుకొని అత్యధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది.

అనుభవంతో పాటు కెప్టెన్సీ..

మెగా వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ఆటగాడు కూడా టీమ్‌ఇండియా క్రికెటర్‌ కావడం విశేషం. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌, సారథిగా రాణిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ను కోల్‌కతా రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అదిరిపోయే మొత్తాన్ని సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఈ దిల్లీ మాజీ సారథి మూడో స్థానంలో నిలిచాడు. శ్రేయస్‌ మొదటి నుంచి దిల్లీ జట్టులోనే కొనసాగుతున్నా 2018 పగ్గాలు అందుకున్నాడు. ఆ ఏడాది విఫలమైనా తర్వాతి సీజన్‌ నుంచి దిల్లీ విశేషంగా రాణిస్తోంది. శ్రేయస్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ ఆ జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. అయితే, గతేడాది గాయం కారణంగా భారత్‌లో జరిగిన తొలి దశలో ఆడలేదు. అప్పుడు పంత్‌ కెప్టెన్సీ చేపట్టి ఆకట్టుకున్నాడు. ఇక యూఏఈలో నిర్వహించిన రెండో దశ కల్లా శ్రేయస్‌ కోలుకొని జట్టులో చేరినా జట్టు యాజమాన్యం పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. అయితే, శ్రేయస్‌ను ఈ సీజన్‌కు ముందు వదిలేయడంతో కోల్‌కతా భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడికున్న అనుభవం గమనించే ఆ జట్టు తీసుకొని ఉంటుంది.

హిట్టింగ్‌తో పాటు స్పిన్నింగ్‌..

ఇక ఈసారి అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ నిలిచాడు. అతడిని పంజాబ్‌ ఏకంగా రూ.11.50 కోట్లకు దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్‌లో హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో స్పిన్‌ బౌలింగ్‌ చేయగల సమర్థుడు ఈ ఇంగ్లిష్‌ ఆల్‌రౌండర్‌. అలాగే గతేడాది జరిగిన ది హండ్రెడ్‌ లీగ్‌లో 27 సిక్సులతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది మాత్రమే కాకుండా పొట్టి క్రికెట్‌లో అతడి స్ట్రైక్‌రేట్‌ సుమారు 158గా ఉంది. దీంతో అతడిని దక్కించుకునేందుకు ఇతర జట్లు కూడా వేలంలో పోటీపడ్డాయి. తొలుత కోల్‌కతా, చెన్నై గుజరాత్‌, హైదరాబాద్‌ జట్లు సైతం  ఆసక్తి చూపాయి. చివరికి పంజాబ్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసి లివింగ్‌స్టోన్‌ను దక్కించుకొంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని