ఇవాళే టీ20 మెగా టోర్నీ ప్రారంభం

వచ్చేసింది వచ్చేసింది.. టీ20 లీగ్ మళ్లీ వచ్చేసింది!ఏటా ఉండేదే కదా. ఏముంది ప్రత్యేకత అంటారా?

Updated : 26 Mar 2022 16:01 IST

నేటి నుంచే 15వ సీజన్‌

ముంబయి

వచ్చేసింది వచ్చేసింది.. టీ20 లీగ్‌ మళ్లీ వచ్చేసింది!

ఏటా ఉండేదే కదా.. ఏముంది ప్రత్యేకత అంటారా?

ఈసారి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి మరి!

ఎప్పట్లా ఈసారి ఆడబోయేది ఎనిమిది జట్లు కాదు. రెండు పెరిగాయ్‌!

అలాగే మ్యాచ్‌ల సంఖ్యా పెరిగింది.  లీగ్‌ ముందే మొదలవుతోంది.

ఎప్పుడూ చూసే ఫార్మాట్‌ కాదు.. ఈసారి కొత్తగా ఉండబోతోంది.

గత సీజన్‌తో పోలిస్తే జట్ల ముఖచిత్రమే మారిపోయింది.

ఒకటి రెండు కాదు.. ఈసారి ఆరు జట్లకు కొత్త కెప్టెన్లను చూడబోతున్నాం.

అన్నింటికీ మించి కరోనా కారణంగా వరుసగా రెండేళ్లు అనిశ్చితిని ఎదుర్కొని, వాయిదాలు  పడి.. ఒకసారి పూర్తిగా, ఇంకోసారి సగం సీజన్‌ విదేశాలకు తరలిన లీగ్‌.. ఈసారి స్వదేశంలో, షెడ్యూల్‌ ప్రకారం, అది కూడా మన అభిమానుల మధ్యే జరగబోతోంది.

క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ లీగ్‌ సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా లీగ్‌లోకి అడుగు పెట్టిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌లతో కలిపి ఈసారి పది జట్లు టైటిల్‌ కోసం తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా లీగ్‌ చరిత్రలో ఒక్క 2011 సీజన్లో మాత్రమే పది జట్లు పోటీ పడ్డాయి. ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరగబోతోంది. అందుకే ఈసారి కాస్త ముందుగా, మార్చి చివరి వారంలోనే లీగ్‌ను మొదలు పెట్టేస్తున్నారు. శనివారం తొలి మ్యాచ్‌లో గత ఏడాది ఛాంపియన్‌ చెన్నై, రన్నరప్‌ కోల్‌కతా తలపడబోతున్నాయి. కొవిడ్‌ ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేశారు. బయో బబుల్‌ పరిధిలో ముంబయిలోని వాంఖడె, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాలు.. పుణెలోని ఎంసీఏ మైదానం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఏ జట్టుదో బోణీ: 2021 సీజన్లో అట్టడుగున నిలిచి, గత ఏడాది అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. అద్భుత ఆటతో కప్పు ఎగరేసుకుపోయింది చెన్నై. నిరుడు ప్రథమార్ధంలో పేలవ ప్రదర్శన చేసి, ద్వితీయార్ధంలో గొప్పగా పుంజుకుని ఫైనల్‌ చేరి త్రుటిలో కప్పు చేజార్చుకుంది కోల్‌కతా. ఈసారి సమవుజ్జీల్లా కనిపిస్తున్న ఈ జట్లలో శుభారంభం చేసేది ఏదో చూడాలి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ చెన్నై మీదే నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే లీగ్‌ ఆరంభం నుంచి ఆ జట్టును నడిపిస్తున్న ధోని.. తొలిసారి కేవలం సభ్యుడిగా బరిలోకి దిగుతున్నాడు. మహి నుంచి ఈ సీజన్‌కు జడేజా పగ్గాలందుకున్న సంగతి తెలిసిందే. మరి కెప్టెన్‌గా జడ్డూ ఎలాంటి ముద్ర వేస్తాడు, బ్యాట్స్‌మన్‌గా ధోని ఎలా ఆడతాడు అన్నది ఆసక్తికరం. ధోని, జడేజాలతో పాటు రుతురాజ్‌, ఉతప్ప, రాయుడు, డ్వేన్‌ బ్రావో లాంటి పాత ఆటగాళ్లనే చెన్నై జట్టులో చూడబోతున్నాం. వీరికి యువ ఆల్‌రౌండర్‌ హంగారేర్కర్‌తో పాటు కివీస్‌ పేసర్‌ మిల్నె, తోడవుతున్నారు. పిచ్‌ను బట్టి పేసర్‌ జోర్డాన్‌ లేదా స్పిన్నర్‌ తీక్షణను చెన్నై ఎంచుకోనుంది. మరోవైపు కోల్‌కతా.. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌కు తోడు, ఆల్‌రౌండర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, రసెల్‌, నరైన్‌లే బలంగా బరిలోకి దిగుతోంది. నితీశ్‌ రాణా కూడా బ్యాటింగ్‌లో కీలకమే. ఫామ్‌లో లేకపోయినా రహానెకు తొలి మ్యాచ్‌లో ఓ అవకాశం ఇవ్వనుంది. అతనే వెంకటేశ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

తుది జట్లు (అంచనా)... చెన్నై: రుతురాజ్‌, ఉతప్ప, కాన్వే, రాయుడు, జడేజా (కెప్టెన్‌), ధోని (వికెట్‌ కీపర్‌), దూబె, డ్వేన్‌ బ్రావో, హంగారేర్కర్‌, జోర్డాన్‌, తీక్షణ, మిల్నె

కోల్‌కతా: వెంకటేశ్‌ అయ్యర్‌, రహానె, శ్రేయస్‌, నితీశ్‌ రాణా, బిల్లింగ్స్‌ (వికెట్‌ కీపర్‌), రసెల్‌, నరైన్‌, చమిక కరుణరత్నె, మావి, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌/రసిక్‌


ఎవరిదో కప్పు?

అంతర్జాతీయ క్రికెట్లో, ప్రపంచకప్‌ లాంటి టోర్నీల్లో హాట్‌ ఫేవరెట్లు ఎవరంటే చెప్పడం సులువే. కానీ బలాబలాల్లో ఎక్కువ తేడా ఉండని ఐపీఎల్‌లో ఫలానా జట్టుదే టైటిల్‌, ఫలానా జట్టు ఏమీ బాగా లేదని ముందే అంచనా వేయడం కష్టమే. అయినా సరే.. ముందు నుంచి జట్టు కూర్పు, మ్యాచ్‌ ప్రణాళికల్లో పకడ్బందీగా వ్యవహరిస్తూ, లీగ్‌లో ఎక్కువ విజయవంతమైన ముంబయి, చెన్నై లాంటి జట్లను ఈసారి కూడా టైటిల్‌ ఫేవరెట్లుగా పేర్కొనాల్సిందే. ఈసారి గరిష్ఠంగా నలుగురిని మినహా అట్టిపెట్టుకునే అవకాశం లేకపోయినా, మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి వీలైనంత ఎక్కువమంది పాత ఆటగాళ్లను ఈ రెండు జట్లూ సొంతం చేసుకున్నాయి. వీటికి బలమైన సహాయ బృందం ఉంది. ఈ రెండు జట్లకు తోడు కొన్ని సీజన్ల నుంచి నిలకడగా ఆడుతున్న దిల్లీ క్యాపిటల్స్‌ కూడా టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటే. శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో కెప్టెన్సీ సమస్య తీర్చుకుని, జట్టును మరింత బలోపేతం చేసుకున్న కోల్‌కతా అవకాశాలనూ కొట్టి పారేయలేం. మిగతా జట్లు ఓ మోస్తరుగా అనిపిస్తున్నాయి. కోహ్లి స్థానంలో బెంగళూరు సారథ్య బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్‌, వార్నర్‌ సన్‌రైజర్స్‌ను వీడటంతో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారుతున్న విలియమ్సన్‌ తమ జట్ల రాత మారుస్తారేమో చూడాలి. మయాంక్‌ సారథ్యంలోని పంజాబ్‌, శాంసన్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌లపై అంచనాలు తక్కువే ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ జట్లుగా పర్వాలేదనిపిస్తున్నా.. ఈ కొత్త టీంలు బరిలోకి దిగాక కానీ వీటి ఆటపై ఓ అంచనాకు రాలేం. జట్ల సంఖ్య పెరుగుతోంది, ఫార్మాట్‌ మారుతోంది కాబట్టి పోటీ పెరుగుతుంది. ఉదాసీనతకు అవకాశమే లేదు. ప్రతి జట్టుకూ ప్రతి మ్యాచ్‌ కీలకమే. కాబట్టి లీగ్‌ రసవత్తరంగా సాగడం ఖాయం.


ఫార్మాట్‌ అలా కాదు..

గత సీజన్‌ వరకు లీగ్‌లో ప్రతి జట్టూ మిగతా ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడేది. మొత్తంగా ప్రతి జట్టుకూ 14 మ్యాచ్‌లు ఉండేవి. ఈ సీజన్లో రెండు జట్లు పెరిగినప్పటికీ.. ఒక్కో జట్టు ఆడే మ్యాచ్‌ల సంఖ్య పెరగబోదు. ఇందుకోసం ఫార్మాట్‌ను మార్చారు. ఈ ప్రకారం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. అత్యధికంగా 5 టైటిళ్లు గెలిచిన ముంబయి గ్రూప్‌-ఎలో ఉంటే, నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై గ్రూప్‌-బిలో ఉంది. రెండు టైటిళ్లతో మూడో స్థానంలో ఉన్న కోల్‌కతాను గ్రూప్‌-ఎలో పెట్టి, ఒక టైటిల్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ను గ్రూప్‌-బిలో చేర్చారు. ఒక టైటిల్‌తో అయిదో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ను గ్రూప్‌-ఎలో, మూడుసార్లు ఫైనల్‌ ఆడిన బెంగళూరు గ్రూప్‌-బిలో పెట్టారు. ఒక్కో ఫైనల్‌ ఆడిన దిల్లీ, పంజాబ్‌లను వరుసగా గ్రూప్‌-ఎ, బిల్లో చేర్చారు. కొత్త జట్లు లఖ్‌నవూ, గుజరాత్‌లను కూడా ఇలాగే ఒక్కో గ్రూప్‌లో పెట్టారు. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే అవతలి గ్రూప్‌లో తనతో సరిసమాన స్థాయిలో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ ప్రకారం ఒక్కో జట్టు ఆడే మొత్తం మ్యాచ్‌లు 14 అవుతాయి.


మరో డీఆర్‌ఎస్‌..

2018లో లీగ్‌లో ప్రవేశపెట్టిన నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌) అవకాశాలను ఒకటి నుంచి ఈ సారి రెండుకు పెంచారు. అంటే ఓ జట్టు ఓ ఇన్నింగ్స్‌లో రెండు సార్లు డీఆర్‌ఎస్‌ కోరవచ్చు. ఇక ఓ బ్యాటర్‌ క్యాచౌట్‌ అయితే కొత్తగా వచ్చే ఆటగాడు స్ట్రైక్‌ (ఓవర్‌ చివరి బంతి మినహా) తీసుకోవాలి. ఇటీవల మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఈ నిబంధనను సవరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కారణంగా జట్లు మైదానంలో దిగే అవకాశం లేకపోతే ఆ మ్యాచ్‌ను వాయిదా వేస్తారు. ఒకవేళ ఆ మ్యాచ్‌ తిరిగి నిర్వహించే ఆస్కారం లేకపోతే ఐపీఎల్‌ సాంకేతిక కమిటీ సూచించిన ప్రకారం ఓ నిర్ణయం తీసుకుంటారు.


ఈ ఆటగాళ్లు కనిపించరు

పది జట్లతో సరికొత్తగా ముస్తాబైన ఈ సీజన్‌లో కొంతమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు కనిపించరు. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న సురేశ్‌ రైనాను వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2020 సీజన్‌ మినహా ఆరంభం నుంచి ఐపీఎల్‌లో కొనసాగిన అతణ్ని.. తిరిగి దక్కించుకోవడానికి సీఎస్కే మొగ్గుచూపలేదు. గతేడాది వరకూ బెంగళూరు అంటే కోహ్లి, డివిలియర్స్‌ ద్వయం గుర్తుకువచ్చేది. కానీ ఇకపై డివిలియర్స్‌ మాయ చూసే అవకాశం లేదు. నిరుడు నవంబర్‌లో అతను అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిస్‌గేల్‌ కూడా సీజన్‌కు దూరంగా ఉన్నాడు. వీళ్లే కాకుండా హర్భజన్‌ సింగ్‌, అమిత్‌ మిశ్రా, బెన్‌స్టోక్స్‌, ఆర్చర్‌, మిచెల్‌ స్టార్క్‌, మోర్గాన్‌ తదితర ఆటగాళ్లు కూడా ఈ సీజన్‌లో కనిపించరు.


నూతన సారథులు..

తొలిసారి ఆరంభం తర్వాత అత్యధిక జట్లకు కెప్టెన్ల మార్పు ఈ సారే జరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా గతేడాది వరకూ అన్నీ తామై జట్లను నడిపించిన కోహ్లి, ధోని ఇకపై ఆటగాళ్లు మాత్రమే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పగ్గాలు వదిలేస్తున్నట్లు గతేడాది సీజన్‌కు ముందే కోహ్లి చెప్పాడు. దీంతో ఆ జట్టు ఈ సీజన్‌ కోసం డుప్లెసిస్‌ను సారథిగా ప్రకటించింది. సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.. ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ పాండ్య, పంజాబ్‌ కింగ్స్‌కు మయాంక్‌ అగర్వాల్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయస్‌ తొలిసారి సారథ్యం వహిస్తున్నారు. కేవలం రోహిత్‌ (ముంబయి ఇండియన్స్‌), పంత్‌ (దిల్లీ క్యాపిటల్స్‌), విలియమ్సన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌), శాంసన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) మాత్రమే పాత కెప్టెన్లు.


వీళ్ల ఆట చూడండి

భారత్‌ను అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతలుగా నిలిపిన కుర్రాళ్లపై ఈ సారి భారీ అంచనాలున్నాయి. ఆ జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (దిల్లీ క్యాపిటల్స్‌), పేస్‌ ఆల్‌రౌండర్లు రాజ్‌వర్ధన్‌ (సీఎస్కే), రాజ్‌ బవా (పంజాబ్‌ కింగ్స్‌) ఎలా రాణిస్తారో చూడాలి. అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు బ్రేవిస్‌ (ముంబయి ఇండియన్స్‌) ఆసక్తి కలిగిస్తున్నాడు. ఇక తెలంగాణ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ (ముంబయి ఇండియన్స్‌)కు ఇదో గొప్ప అవకాశం.


ఈసారి జట్లు: 10

మ్యాచ్‌లు: 74

వేదికలు: 4

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని