Womens Cricket: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలాగే..! 

మహిళల క్రికెట్‌లోనూ దిగ్గజాల పేరుతో సిరీస్‌లు నిర్వహించాలని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌, ఐసీసీ మహిళల కమిటి సభ్యురాలు మెల్‌జోన్స్‌ అభిప్రాయపడ్డారు. త్వరలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో పురుషుల క్రికెట్‌లో నిర్వహించే...

Published : 22 May 2021 21:11 IST

మహిళల క్రికెట్‌లో సిరీస్‌లు నిర్వహించాలి: మెల్‌జోన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళల క్రికెట్‌లోనూ దిగ్గజాల పేరుతో సిరీస్‌లు నిర్వహించాలని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌, ఐసీసీ మహిళల కమిటి సభ్యురాలు మెల్‌జోన్స్‌ అభిప్రాయపడ్డారు. త్వరలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో పురుషుల క్రికెట్‌లో నిర్వహించే ‘బోర్డర్‌-గావస్కర్‌’ ట్రోఫీలా మహిళల ఆటలోనూ అలాంటి సిరీస్‌ ఏర్పాటు చేయాలని కోరారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో భారత మహిళా జట్టు కంగారూలతో ఒక పింక్‌బాల్‌ టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జోన్స్‌ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చారు.

‘బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలాగే మహిళల ఆటలో ఒక సిరీస్ నిర్వహించడం గొప్పగా ఉంటుంది. కానీ, పురుషుల క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లు అంత అద్భుతంగా ఆడిన చరిత్ర ఉంది. ఈ క్రమంలోనే మహిళల ఆటకు సంబంధించి ఏదో ఒకటి చేయాలి. అందులో ఏదైనా కాస్త భిన్నంగా ఉన్నా ఫర్వాలేదు. యాషెస్‌ సిరీస్‌ నుంచే అటు పురుషుల ఆటలో, ఇటు మహిళల క్రికెట్‌లో అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు మనం కూడా గడిచిన వందేళ్లలో జరిగిన ఏదైనా గొప్ప విశేషానికి సంబంధించినది, అది యాషెస్‌కు దీటుగా ఉండేది పెట్టుకోవచ్చు’ అని జోన్స్‌ వివరించారు. కాగా, ఆమె మహిళల ట్రోఫీలకు శాంతా రంగస్వామి, మార్గరెట్‌ జెన్నింగ్స్‌ పేర్లను ప్రతిపాదించారు. అయితే, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా సూచించారు.

కాగా, 1977లో టీమ్‌ఇండియా మహిళా జట్టు పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడింది. అప్పుడు శాంతా జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. అలాగే ఆసీస్‌ మహిళా జట్టుకు మార్గరెట్‌ కెప్టెన్సీ చేశారు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలిసారి 1978 మహిళల ప్రపంచకప్‌లో తలపడ్డారు. అప్పుడు డయానా ఎడుల్జీ టీమ్‌ఇండియా కెప్టెన్సీ చేపట్టారు. అలా తొలితరం క్రికెటర్లను గుర్తు చేసుకుంటే బాగుంటుందని జోన్స్ పేర్కొన్నారు. తొలుత అలాంటి ట్రోఫీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించాలని, ఆపై టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనతో దాన్ని అమలు చేయాలని మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని