‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం

Wrestlers Protest: 1983 క్రికెట్ ప్రపంచకప్‌ గెలిచిన కపిల్‌ సేన.. రెజ్లర్లకు ఓ విన్నపం చేసింది. పతకాలను గంగానదిలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని, తొందరపాటు నిర్ణయం వద్దని కోరింది. 

Updated : 02 Jun 2023 18:53 IST

దిల్లీ: భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు(Wrestlers) తమ నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని హెచ్చరించారు. అందుకు గడువు కూడా పెట్టారు. ఈ సమయంలో 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ దేవ్‌ నేతృత్వంలోని జట్టు(1983 World Cup Winners) రెజ్లర్లకు విన్నపం చేసింది. ఆ పతకాలు మీవి మాత్రమే కాదని, వాటి విషయంలో ఎలాంటి తొందరపాటు  వద్దని కోరింది. (Wrestlers Protest)

‘రెజ్లర్లతో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు కలవరపరిచాయి. ఎంతో శ్రమకోర్చి దేశం కోసం సాధించిన పతకాలను గంగానదిలో కలిపేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. ఆ పతకాల వెనక ఎంతో కృషి, త్యాగం ఉంది. అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. వాటిలో ఈ దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడిఉంది. ఈ విషయంలో వారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వారి బాధలకు సాధ్యమైనంత త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. చట్టం తన తని తాను చేస్తుంది’ అని తమ ప్రకటనలో రెజ్లర్లను కోరారు.

గత ఆదివారం రెజ్లర్లు పార్లమెంట్ భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కుస్తీ యోధులు జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసేందుకు అనుమతిని నిరాకరించారు. ఈ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. గత మంగళవారం వారు ఆ ప్రకటన చేయగా.. రైతు సంఘాల విజ్ఞప్తితో దానిని ఐదు రోజులకు వాయిదా వేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని