Paris Olympics 2024: నాలుగోసారి బరిలోకి దిగుతున్నా.. దేశం గర్వపడేలా చేస్తాం: మన్‌ప్రీత్ సింగ్‌

హాకీ ఇండియా.. ఈ పేరు చెప్పగానే గతంలో ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోయేవి. కానీ, గత నాలుగు దశాబ్దాలుగా అంచనాలను అందుకోవడంలో మన జట్టు విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య సాధించిన టీమ్‌ఇండియా.. మరోసారి పతకంపై గురి పెట్టింది.

Published : 11 Jul 2024 17:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) భారత్ పతకం సాధించగల సత్తా ఉన్న క్రీడల్లో హాకీ ఒకటి. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో టీమ్‌ఇండియా పురుషుల టీమ్‌ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈసారి కూడా మరింత మెరుగైన ప్రదర్శనతో పోడియంపై భారత జెండాను రెపరెపలాడిస్తామని సీనియర్‌ మిడ్‌ఫీల్డర్‌, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో నాలుగోసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్న మన్‌ప్రీత్.. భారత హాకీ దిగ్గజం ధన్‌రాజ్‌ పిళ్లైతో సమంగా నిలవనున్నాడు. పిళ్లై కూడా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. 

‘‘నాలుగోసారి ఒలింపిక్స్‌ను ఆడబోతుండటం అద్భుతంగా అనిపిస్తోంది. ఇలాంటి అరుదైన మైలురాయిని చేరుకోవడం కల. ఇప్పుడు అది నిజం కానుండటం సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల నా శ్రమకు ఫలితం ఇదే. ఆటపట్ల నిబద్ధతతోపాటు కుటుంబం, కోచ్‌లు, సహచరుల మద్దతు వెలకట్టలేనిది. దిగ్గజం ధన్‌రాజ్‌ పిళ్లై అడుగు జాడల్లో పయనిస్తున్నా. స్ఫూర్తిగా నిలిచిన ఎంతో మంది క్రీడాకారులకు ధన్యవాదాలు. పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లోనూ పతకం కోసం చివరి వరకూ పోరాడతాం. కోట్లాది మంది అభిమానుల ఆశలను, కలలను సాకారం చేస్తాం. భారత హాకీ గొప్పదనం గురించి ప్రపంచానికి మరోసారి తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశం గర్వపడేలా చేస్తామని కచ్చితంగా చెప్పగలను’’ అని తెలిపాడు.

మాపై ఒత్తిడేం లేదు

‘‘గత ఒలింపిక్స్‌లోనే కాంస్యం వచ్చింది. ఈసారి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ మా ఆటను ఆస్వాదించాలని చూస్తున్నాం. అదేసమయంలో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయం. వందశాతం మా ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఐక్యంగా ఉంటూ ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించడమే మా లక్ష్యం. ఒక్కో మ్యాచ్‌పై దృష్టిసారించి పతకం సొంతం చేసుకుంటాం. మా ప్రదర్శనపై ఒత్తిడి ప్రభావం పడనీయకుండా ఒకరినొకరం మద్దతుగా నిలిచి ముందుకు సాగుతాం’’ అని మన్‌ప్రీత్ వెల్లడించాడు. 

2011లో అరంగేట్రం

భారత్‌ తరఫున 2011లో అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్‌ దాదాపు 370 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 27 గోల్స్‌ సాధించాడు. తొలిసారి 2012 ఒలింపిక్స్‌లో మెరిశాడు. 2017లో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1980 తర్వాత భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకం అందించిన సారథిగా నిలిచాడు. టోక్యో (2021లో జరిగాయి) ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం అతడికి ఖేల్‌ రత్న అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని