Lionel Messi: ఫిఫా ప్రపంచకప్‌లో ‘ఈగ’ 2.0 సంచలనం..!
మెస్సీ(lionel messi) గురించి వివరించాలంటే.. 2016 ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. 2016 నుంచి మెస్సీ(lionel messi) బాగా రాటుదేలిపోయాడు.. రెట్టించిన ఉత్సాహంతో సవాళ్లను ఎదుర్కోవడం వంటబట్టించుకొన్నాడు. ఫలితంగా ఒంటిచేత్తో ఆర్జెంటీనా(argentina)ను ప్రపంచకప్ ఫైనల్స్(fifa world cup)కు చేర్చాడు.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ప్రపంచకప్‌లో ఓ ‘ఈగ’ సూపర్ హిట్ అయ్యింది.. తన కల నెరవేర్చుకోవడానికి కేవలం 90 నిమిషాల దూరంలో ఉంది. 2018 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి కసిగా ఎదురు చూస్తోంది.. అదేం రాజమౌళి ‘ఈగ’ కాదు.. అర్జెంటీనా ఈగ..! అదే లియోనల్ మెస్సీ(lionel messi)..! అదేంటీ మెస్సీని ఈగతో పోలుస్తున్నారంటారా.. ‘లా పుల్గా’ అనేది మెస్సీ ముద్దుపేరు. స్పానిష్ భాషలో దీనికి ‘ఈగ’ అని అర్థం. ఈ పేరును మెస్సీ సోదరులే పెట్టారు. ఆ తర్వాత ఇది పాపులర్ అయింది. ఈసారి మెస్సీ ఆటలోని శక్తిని చూస్తూంటే అణు రియాక్టర్ మింగాడా అనిపించకమానదు. సెమీఫైనల్స్‌లో అల్వెరెజ్ గోల్‌కు సహకరించిన తీరును పొగడాలన్నా అక్షరాలు దొరకవు. ఫిట్‌నెస్ ప్రాధాన్యంగా ఉండే ఫుట్‌బాల్ వంటి క్రీడలో 35 ఏళ్ల వయసులో ప్రపంచకప్ (fifa world cup)ను అందుకొనేందుకు ఏకవ్యక్తి సైన్యంలా దిగ్గజ జట్లతో తలపడి గెలవడం మెస్సీకే చెల్లింది.
కాలమనే సునామీకి ఎదురీది..!
2014 ప్రపంచకప్(fifa world cup)లో మెస్సీ(lionel messi) ప్రాణం పెట్టి ఆడాడు. ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ, జర్మనీ చేతిలో ఓటమి పాలైంది. సరే ఇంకా సమయం ఉందని మెస్సీ సర్దుకొన్నాడు. 2016 కోపా అమెరికా కప్‌లో చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా (argentina) ఓడిపోయింది. మెస్సీ ఈ ఓటమితో చలించిపోయాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచిస్తే.. జాతీయ జట్టులో ఇది నా చివరి మ్యాచ్ అనిపించింది. ఇది నాకు తగదనిపిస్తోంది. ఇదే సరైన సమయం. మరోసారి భారీ విషాదం’’ అని తాను వైదొలగుతున్న విషయాన్ని వెల్లడించాడు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలలకే మెస్సీ మళ్లీ మనసు మార్చుకొన్నాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నట్లు ప్రకటించాడు.
ఆ తర్వాత రెండేళ్లకు మెస్సీ(lionel messi) 2018లో రష్యాలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్(fifa world cup)లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో అర్జెంటీనా(argentina) రౌండ్-16లోనే ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడి ఇంటికొచ్చింది. ఆ జట్టుకు ఇది దారుణమైన ఓటమి. వాస్తవానికి నాటి జట్టు కోచ్ జార్జ్ సంపోలీ, అతడి సిబ్బంది తీరు మెస్సీకి అంతగా నచ్చేది కాదు. దీంతో అతడు ఒంటరిగానే గడిపేవాడు. కొన్ని సందర్భాల్లో వారితో గొడవ పడ్డాడు కూడా. సంపోలీ తీరు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మారడోనాకు కూడా నచ్చలేదు. ఈ టోర్నీ తర్వాత సంపోలీకి అర్జెంటీనా ఉద్వాసన పలికింది. మెస్సీ ప్రపంచకప్ (fifa world cup) కలలు కూడా దాదాపు ముగిసిపోయాయి. 2022 ప్రపంచకప్ నాటికి 35 ఏళ్ల వయసు వస్తుంది. ఫిట్‌నెస్ సహకరిస్తుందో.. లేదో తెలియదు. దీంతో 31 ఏళ్ల మెస్సీలో మరోసారి రిటైర్మెంట్‌పై అంతర్మథనం మొదలైంది. ఈ విషయం అప్పటికే జట్టు అసిస్టెంట్ కోచ్ లియోనల్ స్కాలోని చెవిన పడింది. స్కాలోని, మెస్సీ ఇద్దరూ దాదాపు ఒకేసారి అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ చనువుతో అతడు మెస్సీకి ఓ వాట్సాప్ సందేశం పంపాడు. ‘‘హలో లియో, నేను స్కాలోని. నాతో పాటు పాబ్లో ఉన్నాడు. మేం నీతో మాట్లాడాలనుకొంటున్నాం’’ అని దానిలో పేర్కొన్నాడు. వీరిద్దరు సమకాలీకులు, మిత్రులు కావడంతో మెస్సీ అంగీకరించాడు. ఆ తర్వాత వీరు టెలిఫోన్‌లో మాట్లాడి రిటైర్మెంట్ విషయం వాయిదా వేసేలా మెస్సీని ఒప్పించారు. ఆ తర్వాత స్కాలోని, పాబ్లో జాతీయ జట్టు కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
టార్గెట్ ప్రపంచకప్..
2022 ప్రపంచకప్(fifa world cup)ను అందుకోవాలనే లక్ష్యాన్ని సాధించేందుకు వీరు ప్లాన్ సిద్ధం చేసుకొన్నారు. తొలుత ‘కోపా అమెరికా’ లక్ష్యంగా పెట్టుకొన్నారు. 2016లో ఏ టోర్నీలో అయితే ఓడిపోయి మెస్సీ(lionel messi) నీరసపడ్డాడో.. 2021లో మళ్లీ అదే టోర్నీలో విశ్వరూపం చూపాడు. మొత్తం 4 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా’ టైటిల్‌ను అర్జెంటీనా (argentina) దక్కించుకొంది. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి లభించిన అతిపెద్ద టైటిల్ ఇది. దీంతో మెస్సీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచకప్‌పై దండయాత్ర ప్రకటించాడు.
కోపా విజయంతో మెస్సీలో ఎనలేని ఆత్మవిశ్వాసం పెరిగింది. 1986లో డిగో మారడోనా ఎంత దూకుడుగా ఆడి అర్జెంటీనా(argentina)కు ప్రపంచకప్‌ను అందించాడో.. ఈ సారి మెస్సీ కూడా అంతే దూకుడుగా ఉన్నాడు.
2016 తర్వాత నుంచి మెస్సీ 2.0..
మెస్సీ మెతక వైఖరితో విసుగు చెందిన మారడోనా ఒక సారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘అతడు గొప్ప ఆటగాడే. కానీ, నాయకుడు కాదు. మ్యాచ్‌కు ముందు 20 సార్లు టాయిలెట్‌కు వెళ్లే వ్యక్తిని నాయకుడిగా చేయడం వృథా. బార్సిలోనాకు అడే మెస్సీ వేరు.. అర్జెంటీనా(argentina)కు ఆడే మెస్సీ వేరు’’ అని విమర్శించాడు . కానీ ఈ సారి ప్రపంచకప్(fifa world cup)లో మారడోనా కలలుగన్న దూకుడైన మెస్సీ (lionel messi) ప్రపంచానికి కనిపించాడు.
మెస్సీ (lionel messi)సాధారణంగా బహిరంగ వివాదాలకు దూరంగా ఉంటాడు. అద్భుతమైన ఆటగాడిగా పేరున్నా.. అణకువగా ప్రవర్తించడం మెస్సీ శైలి. ఇదే అతడికి భారీ అభిమానులను తెచ్చిపెట్టింది. 2012లో లీగ్‌ల్లో సహచరుడు డేవిడ్ విల్లాతో వివాదం వంటి చెదురుమదురు ఘటనలు మాత్రమే ఉన్నాయి. 2016 తర్వాత నుంచి మెస్సీలో బలమైన మార్పు వచ్చింది. జులపాల జట్టుతో లవర్‌బాయ్‌లా ఉండే మెస్సీ.. గడ్డంతో రఫ్ లుక్‌లోకి మారిపోయాడు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ, మెస్సీ రూపులోనే కాదు.. శైలిలో కూడా మార్పు వచ్చింది. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో రెఫరీ తప్పుడు నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. 2019లో మూడు మ్యాచ్‌ల నిషేధానికి కూడా గురయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విశ్వరూపం చూపాడు. ఏకంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డగౌట్ ముందు ఆగి ఆ జట్టు కోచ్ లూయిస్ వాన్ గాల్‌ను వెక్కిరించాడు. మ్యాచ్ అనంతరం కూడా అతడు గాల్‌తో ఘర్షణకు దిగాడు. మీడియా సమావేశంలో నెదర్లాండ్స్ ఆటగాడిని దూషించాడు. మెస్సీపై వేటు పడుతుందని భావించారు. కానీ, అదృష్టవశాత్తు ఇప్పటి వరకు అటువంటిదేమీ లేదు.
టీం స్పిరిట్..
ఈ సారి అర్జెంటీనా(argentina) జట్టులో టీమ్ స్పిరిట్ కూడా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అర్జెంటీనా(argentina) జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మెస్సీ(lionel messi)ని ఆరాధిస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2011 ప్రపంచకప్(fifa world cup)లో సచిన్ కోసం భారత్ జట్టులో యువరాజ్ వంటి వారు ఎంత శ్రమించారో.. అదే విధంగా మెస్సీ కోసం అర్జెంటీనా జట్టులో ఆటగాళ్లు తపనపడుతున్నారు. జులియన్ అల్వెరెజ్ పదేళ్ల క్రితం మెస్సీతో సెల్ఫీ కోసం ఉబలాటపడ్డ కుర్రాడు. ఇప్పుడు జట్టులో తన ఆరాధ్య దైవంతో కలిసి బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అల్వెరెజ్ నాలుగు గోల్స్ చేసి భీకరఫామ్‌లో ఉన్నాడు. మెస్సీ కూడా జట్టు సమావేశాల్లో ఎప్పుడూ ప్రపంచకప్ ‘నా కల’ అని అనలేదు. ‘మన కల’.. దీనిని దేశం కోసం, మారడోనా కోసం సాకారం చేయాలని సభ్యుల్లో ఉత్సాహం నింపాడు. తాను పెద్ద క్రీడాకారుడిననే అహంకారం ఎప్పుడూ ప్రదర్శించలేదు. మూడు గోల్స్‌కు అసిస్ట్ చేయడమే దీనికి నిదర్శనం.
విధిని ఎదిరించిన పోరాట యోధుడు..
1987 జూన్ 24న మెస్సీ (lionel messi) అర్జెంటీనా(argentina)లోని శాంటా ఫే ప్రావిన్స్‌లో జన్మించాడు. ఐదేళ్ల వయసులోనే అతడి తండ్రి కోచింగ్ ఇస్తున్న గ్రాండోలి ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడటం మొదలుపెట్టాడు. 1995లో న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్‌కు మారాడు. అప్పుడు అతడి వయస్సు 11 ఏళ్లు. ఆ సమయంలో శరీరం ఎదుగుదలకు సహకరించే ‘గ్రోత్ హార్మోన్’ అతడిలో లోపించినట్లు గుర్తించారు. మెస్సీ ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 500 పౌండ్లు ఖర్చయ్యేది. అంత సొమ్ము అతడి కుటుంబం వద్ద లేదు. ఆ సమయంలో ఎఫ్‌సీ బార్సిలోనా క్లబ్ డైరెక్టర్ కార్లోస్ రెక్సోచ్.. మెస్సీ ఆటతీరుకు ముగ్ధుడయ్యాడు. స్పెయిన్‌కు వలసవచ్చి తమ క్లబ్‌లో ఆడాలని కోరాడు. వైద్యఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో మెస్సీ కుటుంబం మొత్తం స్పెయిన్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత బార్సిలోనా-బి టీమ్‌లో స్థానం దక్కించుకొన్నాడు. అప్పట్లో ఆడిన ప్రతిమ్యాచ్‌లో సగటున ఒక గోల్ చేయడం విశేషం. మొత్తం 30 మ్యాచ్‌ల్లో 35 గోల్స్ చేశాడు. ఆ తర్వాత 2004లో బార్సిలోనా ప్రధాన జట్టులో స్థానం దక్కించుకొన్నాడు. 2005లో లా లీగాలో గోల్ చేసిన బార్సిలోనా ఆటగాళ్లలో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్