LSG vs MI: అవకాశం కోసం అప్పటి నుంచి ఎదురుచూస్తూనే ఉన్నా: ఆకాశ్‌ మధ్వాల్

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించడంలో ముంబయి యువ బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్ (Akash Madhwal) కీలక పాత్ర పోషించాడు. దీంతో పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Published : 25 May 2023 09:45 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ పోరులో ముంబయి ఇండియన్స్‌ మరొక ముందడుగు వేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసి రెండో క్వాలిఫయర్‌లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబయి బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి లఖ్‌నవూ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ముంబయి చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా అవతరించాడు. గతంలో అల్జారీ జోసెఫ్‌ (6/12) సన్‌రైజర్స్‌పై ఇలాగే చెలరేగాడు. ఇప్పుడు మధ్వాల్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా (5/10), మలింగ (5/13)ను దాటేశాడు.

ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన మధ్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్‌ అనంతరం మధ్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. అందుకోసం చాలా శ్రమించా. ఇంజినీరింగ్‌ చదివిన నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. 2018 నుంచి నా సత్తాను చాటేందుకు నిరీక్షించా. ప్రాక్టీస్‌ సెషన్స్‌ సందర్భంగా నెట్స్‌లో మాకంటూ కొన్ని లక్ష్యాలను మేనేజ్‌మెంట్ నిర్దేశించేది. దీంతో మా అత్యుత్తమ ప్రతిభను వెలికి తీసేవారు. రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నికోలస్‌ పూరన్‌ను తొలి బంతికే ఔట్‌ చేయడం ఎంతో ఆనందం కలిగించింది’’ అని చెప్పాడు.

అభిమానులు కూడా ఊహించి ఉండరు: రోహిత్

‘‘గతేడాది సపోర్ట్‌ బౌలర్‌గా ఉన్న ఆకాశ్‌ మధ్వాల్.. ఈసారి తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అద్భుతం. మేం ఆడిన విధానం చూసి ఇక్కడి వరకు చేరుతామని అభిమానులు కూడా ఊహించి ఉండరు. గత కొన్నేళ్లుగా యువ క్రికెటర్లకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ వచ్చాం. జట్టులో వారు కీలకమనే భావన కల్పించడం చాలా ముఖ్యం. నా బాధ్యత కూడా అదే. జట్టులో వారికి సౌకర్యంగా ఉండేలా చూస్తా. జట్టు కోసం ఏం చేయాలనేదానిపై వారికి పూర్తి అవగాహన ఉంది. వాంఖడే స్టేడియంలో ఒకటీ రెండు మంచి ప్రదర్శనలు ఉంటే సరిపోతుంది. కానీ, చెన్నై పిచ్‌పై జట్టు మొత్తం కలిసి ఆడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది’’ అని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 

అతడి వల్లే ఇదంతా: కామెరూన్‌ గ్రీన్‌

ముంబయి ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్ (41) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌లోనూ మూడు ఓవర్లు వేసిన గ్రీన్‌ వికెట్‌ తీయకపోయినా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గేమ్‌ మాకు చాలా కీలకం. సరైన సమయంలో విజయం సాధించాం. మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అతడు.. ఇంకా అద్భుతంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫీల్డింగ్‌లోనూ చాలా మెరుగయ్యాం. ఇక గుజరాత్ టైటాన్స్‌ పటిష్ఠమైన జట్టు. చెన్నై చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. తక్కువగా అంచనా వేయలేం. తప్పకుండా మంచి మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా’’ అని చెప్పాడు. 

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో లఖ్‌నవూ సాధించిన 101 పరుగులు మూడో అత్యల్ప స్కోరు. గతంలో ఆర్‌సీబీపై (2010 సీజన్‌లో) 82 పరుగులు, రాజస్థాన్‌పై (2008 సీజన్‌లో) 87 పరుగులను డెక్కన్ ఛార్జర్స్‌ చేసింది.
  • అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ప్లేయర్‌గా ఆకాశ్ మధ్వాల్‌ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 5/5 ప్రదర్శన చేయగా.. గతంలో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు అంకిత్‌ రాజ్‌పుత్‌ సన్‌రైజర్స్‌పై (2018 సీజన్‌లో) 5/14 ప్రదర్శన చేశాడు.
  • ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ చేసిన బౌలర్ల జాబితాలో ఆకాశ్ మధ్వాల్‌ ఐదో స్థానంలో నిలిచాడు. అల్జారీ జోసెఫ్‌ (6/12), సోహైల్ తన్వీర్ (6/14), ఆడమ్ జంపా (6/19), అనిల్‌ కుంబ్లే (5/5) ముందున్నారు. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు కూడా ఆకాశ్‌ మధ్వాల్‌ పేరునే ఉండటం విశేషం.
  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో భారీ తేడాతో గెలిచిన మూడో జట్టుగా ముంబయి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూపై ముంబయి 81 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో డెక్కన్‌ ఛార్జర్స్‌పై రాజస్థాన్‌ 105 పరుగులు, డెక్కన్‌ ఛార్జర్స్‌పై సీఎస్‌కే 86 పరుగుల తేడాతో విజయం సాధించాయి. 
  • ప్లేఆఫ్స్‌లోని ఒకే మ్యాచ్‌లో అత్యధిక రనౌట్లు అయిన రెండో మ్యాచ్‌ ఇదే. గతంలో ముంబయి-సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ మూడు రనౌట్లు నమోదు కాగా.. నిన్నటి మ్యాచ్‌లోనూ ముగ్గురు ఇలా పెవిలియన్‌కు చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని