థాంక్స్‌ అన్న Pollard.. వైఫల్యమేనన్న MS Dhoni

భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తన అలవాటని ముంబయి ఇండియన్స్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. చిన్నమైదానం, హిట్టర్లు ఉండటంతో సానుకూలంగా ఆడాలని భావించామని కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. భారీ స్కోరు చేసినప్పటికీ ప్రణాళికలు....

Published : 02 May 2021 10:58 IST

ఇలాంటి ఛేదన చూడలేదన్న రోహిత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తన అలవాటని ముంబయి ఇండియన్స్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. చిన్నమైదానం, హిట్టర్లు ఉండటంతో సానుకూలంగా ఆడాలని భావించామని కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. భారీ స్కోరు చేసినప్పటికీ ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యామని చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ పేర్కొన్నాడు. పొలార్డ్‌ను చూసి గర్విస్తున్నామని హార్దిక్‌ పాండ్య అంటున్నాడు. శనివారం చెన్నై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఛేదించిన సంగతి తెలిసిందే.


అంకుల్‌ స్టీవెన్‌కు థాంక్స్‌

(కీరన్‌ పొలార్డ్‌: 87*; 34 బంతుల్లో 6×4, 8×6; 2-0-12-2)

ఆ దేవుడికి, అంకుల్‌ స్టీవెన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు పైనుంచి చూస్తూ నాకు ధైర్యం, బలాన్నీ ఇచ్చారు. చెన్నై మొయిన్‌ అలీ వికెట్‌ మాత్రమే కోల్పోవడంతో సీమర్లు బౌలింగ్‌ చేస్తే మంచిదనిపించింది. నేను రెండు వికెట్లు తీశాను. మరో ఓవర్‌ను అద్భుతంగా విసిరినందుకు సంతోషంగా ఉంది. ఇది చిన్న మైదానం. ఛేదనలో వారు నాలుగు ఓవర్లు స్పిన్నర్లతో వేయించాల్సి ఉందని తెలుసు. అందుకే సిక్సర్లు బాదేస్తే ఆటను చివరి వరకు తీసుకెళ్లొచ్చని అనుకున్నా. ఎంతో సాధన చేయడంతోనే సిక్సర్లు బాదడం అలవాటైంది. 360 డిగ్రీల్లో కొడతానని కాదు గానీ భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం నా అలవాటు. ఆఖరి 6 బంతుల్ని నేనే ఆడాలనుకున్నా. మొత్తానికి విజయం సాధించాం. ఈ మైదానంలో మాకిది రెండో విజయం. సీజన్‌ మధ్య దశలో మేం బాగా ఆడతామని ధీమాగా ఉన్నాం.


ఇలాంటి ఛేదన చూడలేదు

(రోహిత్‌ శర్మ: 35; 24 బంతుల్లో 4×4, 1×6)

నేనాడిన అత్యంత గొప్ప టీ20 మ్యాచుల్లో ఇదొకటి. ఇలాంటి ఛేదనను గతంలో చూడలేదు. పొలార్డ్‌ ఆటను చూస్తే అద్భుతంగా అనిపించింది. చిన్నమైదానం, పిచ్‌ బాగుండటంతో 20 ఓవర్లు సానుకూలంగా ఆడాలనుకున్నాం. మాకు శుభారంభం లభించింది. మా బ్యాటింగ్‌ లైనప్‌లో షాట్లు బాదేవారున్నారు. వాళ్లు స్వేచ్ఛగా ఆడాలని కోరుకున్నాం. లక్ష్య ఛేదనలో కృనాల్‌-పొలార్డ్‌ భాగస్వామ్యం అత్యంత కీలకం. ఇలాంటి ఛేదనలో పవర్‌ హిట్టర్లు ఎక్కువ బంతులు ఆడాలని కోరుకుంటాం. కృనాల్‌ మంచి బ్యాటర్‌. మేం అతడికి అండగా ఉంటాం. ఎడమచేతివాటం ఆటగాళ్లు ఉండటం ఎప్పటికీ మంచిదే. మా ఆటకు దిల్లీ నప్పుతుంది. కొన్ని మ్యచుల్లో బౌలర్లు పరుగులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనా వారికి అండగా ఉండాలి.


ప్రణాళిక అమల్లో విఫలం

(ఎంఎస్‌ ధోనీ, చెన్నై సారథి)

ఈ వికెట్‌ చాలా బాగుంది. ప్రణాళికలు అమలే తేడా. బౌలర్లను నిందించడానికేమీ లేదు. కీలక సమయాల్లో మేం క్యాచులు జారవిడిచాం. బౌలర్లు మరింత మెరుగ్గా వేయాల్సింది. కానీ దీన్నుంచి నేర్చుకోవడం అవసరం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. షాట్లు బాదేందుకు వికెట్‌ అనువుగా ఉంది. కొన్నిసార్లు గెలుపు ముగింట బోల్తా పడటం మామూలే. పాయింట్ల పట్టికలో మేం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు. ఒక్కో మ్యాచును ఆడుతూ ముందుకెళ్తాం.


పొలార్డ్‌ను చూసి గర్విస్తున్నాం

(హార్దిక్‌ పాండ్య: 16; 7 బంతుల్లో 2×6)

ఇలాంటి మ్యాచుల్లో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు. పొలార్డ్‌ ఇలా ఆడినప్పుడు మాటలుండవు. కొన్నేళ్లుగా అతడీ పని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నాడు. అతడు నిలకడగా ఆడటం అద్భుతం. ఈ మ్యాచును నేనే ముగించాలని భావించా. ఏదేమైనా గెలిచినందుకు సంతోషం. ఇలాంటి భారీ స్కోరు ఛేదించేటప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదు. క్రీజులోకి వెళ్లి చితకబాదాలంతే. టోర్నీలో సరైన సమయంలో మేం పుంజుకున్నాం. ఈ గెలుపు మా జోరును పెంచుతుందనడంలో సందేహం లేదు. పొలార్డ్‌ను చూసి గర్విస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని