MI vs RR: మూడో గెలుపు ఎవరిదో

ఐదో సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్‌ జట్టు తాజా సీజన్‌లో తడబడుతోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలను దక్కించుకుని

Updated : 29 Apr 2021 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్‌ తాజా సీజన్‌లో తడబడుతోంది. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలను దక్కించుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నేడు రోహిత్‌ సేన, రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అటు రాజస్థాన్‌ కూడా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరి ఈ రెండింటిలో మూడో గెలుపు ఎవరికి సొంతమవుతుందో!

వరుస ఓటముల తర్వాత..

ఈ సీజన్‌లో ముంబయి అనుకున్నంతగా రాణించడంలేదు. హార్దిక్ పాండ్య, కీరన్‌ పోలార్డ్‌ మెరుపులు.. రోహిత్‌ శర్మ భారీ షాట్లు కనిపించడం లేదు. చివరి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు స్కోరు 150 కూడా దాటలేదు. దీంతో ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి తప్పలేదు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోతూ పరుగులేమీ చేయకపోవడం రోహిత్‌ సేనకు ప్రమాదంగా మారుతోంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణిస్తేనే ముంబయికి గెలుపు అవకాశాలు ఉండేలా కన్పిస్తోంది. ఇక బౌలింగ్‌ పరంగా బుమ్రా ఎకానమీ రేట్‌ బాగున్నా.. ఈ సీజన్‌లో వికెట్లు పెద్దగా తీయలేకపోతున్నాడు. అయితే రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌పై బుమ్రాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు అతడిని మూడుసార్లు వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక బౌల్ట్‌ కూడా సంజూ శాంసన్‌ను కట్టడి చేయగలడు. బౌలర్లకు తోడుగా మిడిలార్డర్‌లో పాండ్యా బ్రదర్స్‌ బ్యాట్‌ ఝళిపిస్తే.. ముంబయికి రాజస్థాన్‌పై గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. రెండు ఓటముల తర్వాత ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని రోహిత్‌ సేన కసి మీద ఉంది. 

రాజస్థాన్‌కు ఆటగాళ్ల కొరత..

అటు రాజస్థాన్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. గాయం కారణంగా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ ఇప్పటికే జట్టుకు దూరమవగా. ఆండ్రూ టై, లివింగ్‌స్టోన్‌ కూడా వ్యక్తిగత కారణాలతో బబుల్‌ను వీడుతున్నారు. దీంతో రాజస్థాన్‌ జట్టు మరింత కష్టాల్లో పడినట్లయింది. అయితే చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఆరు వికెట్లతో గెలిచి.. ఈ మ్యాచ్‌కు కూడా అదే ఉత్సాహంతో సిద్ధమవుతోంది. ముంబయిపై సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ బాగుంది. 16 మ్యాచ్‌ల్లో 140 స్ట్రయిక్‌ రేట్‌తో 446 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధశతకాలున్నాయి. అటు శ్రేయస్‌ గోపాల్‌కు కూడా ముంబయిపై మంచి రికార్డే ఉంది. నేటి మ్యాచ్‌లో నెగ్గాలంటే శాంసన్‌ మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని