IPL 2023: ఆ జట్టుదే ఐపీఎల్‌ 16వ సీజన్‌ టైటిల్‌: మైకెల్ వాన్

ఐపీఎల్‌ (IPL 2023) మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా ఎదురు చూస్తున్నాడట. అంతేకాదు ఈసారి విజేతగా నిలిచే జట్టు ఏదో కూడా ముందే అంచనా వేసేశాడు.

Published : 31 Mar 2023 10:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) మెగా టోర్నీ 16వ సీజన్‌ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. సినీ స్టార్ల ప్రదర్శనలతో నరేంద్ర మోదీ స్టేడియం హోరెత్తనుంది. తొలి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల (GT vs CSK) మధ్య జరగనుంది. కొత్తగా వచ్చిన గుజరాత్‌  గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. జట్లలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయే జట్టేదో వెల్లడించాడు. గతేడాది ఫైనల్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. 

‘‘ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రారంభం కోసం ఆత్రుతగా ఉన్నా. క్రిక్‌బజ్‌తో జట్టు కట్టేందుకు ఎదురుచూస్తున్నా. ఈ సంవత్సరం రాజస్థాన్‌ రాయల్స్‌దే. ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకునే జట్టు రాజస్థాన్‌’’ అని మైకెల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు.  తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటి వరకు మరోసారి విజేతగా నిలవలేకపోయింది. గతేడాది ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. సంజూ శాంసన్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌ ఈసారి మాత్రం గట్టిపోటీదారుగా ఉంటుందని, టైటిల్‌ను సాధించే అవకాశం ఉందని మైకెల్‌ వాన్‌ తెలిపాడు. తొలిసారి ఇంగ్లాండ్‌ సీనియర్ ఆటగాడు జో రూట్‌ ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. మిడిలార్డర్‌లో కీలకమవుతాడని రాజస్థాన్‌ భావిస్తోంది. ఏప్రిల్ 2న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో రాజస్థాన్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని