Jaffer-Vaughan : జాఫర్‌తో ట్విటర్‌ వార్‌.. ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లాలి: మైఖేల్‌ వాన్‌

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్ మాజీ కెప్టెన్‌ మైకెల్ వాన్‌, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ మధ్య ...

Published : 25 Feb 2022 16:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్ వాన్‌, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ మధ్య ట్విటర్‌ వార్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైనా భారత జట్టు సరిగా ఆడనప్పుడు వెటకారంగా కామెంట్లు చేస్తూ మైఖేల్‌ వాన్ ట్విటర్‌లో పోస్టులు పెడుతుంటాడు. వాటికి ఘాటుగా కౌంటర్‌ ట్వీట్‌లను జాఫర్‌ సంధిస్తుంటాడు. ఇప్పుడు మరోసారి మైఖేల్‌ వాన్‌ అసందర్భంగానే జాఫర్‌ను కదిలించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్ ఛానెల్‌లో మైఖేల్‌వాన్‌ మాట్లాడుతూ.. జాఫర్‌తో ట్విటర్‌ పరిహాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవాలంటే 2002 లార్డ్స్‌ టెస్టు మ్యాచ్‌నాటి సంగతులను గుర్తు చేసుకోవాలన్నాడు. ‘‘టెస్టుల్లో నా తొలి వికెట్ వసీం జాఫర్‌దే. 2002లో లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేను విసిరిన బంతి జాఫర్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ చేతిలో పడింది. నా బౌలింగ్‌లోనే జాఫర్‌ ఆడలేకపోయాడు’’ అని పేర్కొన్నాడు. 

తమ మధ్య ట్విటర్‌ వార్‌ సరదాగా ఉంటుందని, దానిని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నట్లు వాన్ వివరించాడు. జాఫర్‌ స్పందన కోసం వేచి చూస్తానని తెలిపాడు. మైఖేల్‌ వాన్‌ తన 82 టెస్టుల కెరీర్‌లో కేవలం ఆరు వికెట్లను మాత్రమే పడగొట్టాడు. అందులోనూ నాలుగు భారత్‌కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. 2002లో టీమ్‌ఇండియా నాలుగు టెస్టులను ఆడేందుకు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా తొలి టెస్టులో వసీం జాఫర్‌ను, రెండో టెస్టులో సచిన్, అజిత్‌ అగార్కర్‌, నాలుగో టెస్టు మ్యాచ్‌లో మరోసారి అగార్కర్‌ వికెట్‌ను తీశాడు. సచిన్‌, అగార్కర్‌లను బౌల్డ్‌ చేయగా.. జాఫర్‌ క్యాచ్‌ రూపంలో వికెట్‌ను దక్కించుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని