Michael Vaughan: అదే నిజమైతే జోరూట్‌.. సచిన్‌ను అధిగమిస్తాడు: వాన్

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోరూట్‌ టెస్టు్ల్లో సచిన్‌ తెందూల్కర్‌ అత్యధిక పరుగుల (15,921) రికార్డును అధిగమిస్తాడని ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 07 Jun 2022 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోరూట్‌ టెస్టుల్లో సచిన్‌ తెందూల్కర్‌ అత్యధిక పరుగుల (15,921) రికార్డును భవిష్యత్తులో అధిగమిస్తాడని ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. గతవారం లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రూట్‌ (115) శతకంతో చెలరేగి.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసిన రెండో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అతడి ఆటతీరును ప్రశంసించిన వాన్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో టెస్టుల్లో సచిన్‌ను అధిగమిస్తాడని చెప్పుకొచ్చాడు.

‘ఇంగ్లాండ్‌ జట్టులో జోరూట్‌ అత్యుత్తమ క్రికెటర్‌. నా దృష్టిలో అతడు దిగ్గజ బ్యాటర్‌ గ్రహమ్‌ గూచ్‌ సరసన నిలుస్తాడు. ఇప్పుడు అతడు ఆడుతున్న తీరును బట్టి చూస్తే..  టెస్టుల్లో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటికీ రూట్‌.. సచిన్‌ కన్నా 6వేల పరుగులు తక్కువే ఉండొచ్చు. కానీ, అతడి వయస్సు 31 ఏళ్లే. ఒకవేళ జేమ్స్‌ అండర్సన్‌ 40 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడితే అప్పుడు రూట్ కూడా అంత వయసు వరకు ఆడగలడని నేను నమ్ముతా. అలాంటప్పుడు.. సచిన్‌ రికార్డును అధిగమించొచ్చు. కాగా, రూట్‌ ఇప్పటివరకు 118 టెస్టుల్లో మొత్తం 10,015 పరుగులు సాధించాడు. అందులో 26 శతకాలు, 53 అర్ధ శతకాలు ఉన్నాయి. సగటు 49.57గా నమోదైంది. మరోవైపు సచిన్‌ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 శతకాలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 53.78గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని