INDvsENG: భారత్‌తో అలా చేస్తే ఇంగ్లాండ్‌కే నష్టం

టీమ్‌ఇండియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో పచ్చిక మైదానాల్లో ఒకే రకమైన పిచ్‌లు తయారు చేస్తే దీర్ఘకాలంలో అది ఇంగ్లాండ్‌కే నష్టమని మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఓటమి అంచున నిలిచిన...

Published : 14 Jun 2021 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో పచ్చిక మైదానాల్లో ఒకే రకమైన పిచ్‌లు తయారు చేస్తే భవిష్యత్తులో అది ఇంగ్లాండ్‌కే నష్టమని మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఓటమి అంచున నిలిచిన నేపథ్యంలో టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకోకపోవడమే ఇంగ్లాండ్‌ చేసిన తప్పని వాన్‌ పేర్కొన్నాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా ఇంగ్లాండ్‌కు కలిసివచ్చిందని, ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టులోనూ అలాంటి పిచ్‌నే రూపొందించడం వ్యూహాత్మక తప్పిదమని వివరించాడు.

నలుగురు సీమర్లతో బరిలోకి దిగితే వాళ్లతో ఎక్కువ ఓవర్లు వేయించాల్సి వస్తుందని, అలా కాకుండా జాక్‌లీచ్‌ను తుది జట్టులోకి తీసుకొని కెప్టెన్‌ జోరూట్‌తో బౌలింగ్‌ చేయించి ఉంటే పేసర్లకు కాస్త ఊరట లభించేదని వాన్‌ విమర్శలు చేశాడు. టీమ్‌ఇండియాతో ఆడేటప్పుడు ఇంగ్లాండ్‌ ఇలాంటి తప్పులు చేయదని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అప్పుడు తమకు అనుకూలంగా ఉండే వికెట్లు తయారు చేసి.. స్వల్ప తేడాతో టెస్టు మ్యాచ్‌లు గెలుపొందినా అది ఇంగ్లాండ్‌కు మంచి చేయదని వాన్‌ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియా  తర్వాత ఇంగ్లాండ్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అలాంటప్పుడు మంచి వికెట్లపై ఎలా ఆడాలో ఎలా గెలవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై స్పందించిన అతడు న్యూజిలాండే ఫేవరెట్‌ జట్టని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం వల్ల ఆ జట్టుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో రెండు బృందాలుగా విడిపోయి ఆడినా అది అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే సరిపోదని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని