Virat Kohli: అందరిలాగే కోహ్లీ కూడా విసుగు చెందాడు: మైక్‌ హెసన్

అందరిలాగే విరాట్‌ కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగుచెందాడని బెంగళూరు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు...

Updated : 14 May 2022 10:58 IST

ముంబయి: అందరిలాగే విరాట్‌ కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగుచెందాడని బెంగళూరు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులే చేసి మరోసారి నిరాశపర్చిన కోహ్లీ.. పెవిలియన్‌కు చేరేటప్పుడు తీవ్ర అసహనంతో కనిపించాడు. 210 పరుగుల భారీ ఛేదనలో కెప్టెన్‌ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన అతడు 3.2 ఓవర్‌కు రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అంతలోపే 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాధించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు చెలరేగిపోతాడని అంతా భావించారు. కానీ, తక్కువ స్కోరుకే ఔటై తీవ్రంగా నిరాశ చెందాడు. అతడు పెవిలియన్‌ బాటపట్టినప్పుడు అసహనంతో ఏదో అరుస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం కోహ్లీ గురించి హెసన్‌ మాట్లాడాడు.

‘ఈ మ్యాచ్‌లో విరాట్‌ బాగా ఆడేలా కనిపించాడు. ఇన్నింగ్స్‌ను కూడా ధాటిగా ఆరంభించాడు. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ వస్తుందని ఆశించాను. కానీ, మరోసారి నిరాశే మిగిలింది. అతడు ఔటైన బంతి గ్లౌజ్‌ అంచులకు తాకుతూ గాల్లోకి వెళ్లింది. అది దురదృష్టకరం. పలు బౌండరీలు సాధించి.. బాగా ఆడుతున్నట్లు.. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. వెంటనే ఔటవ్వడం ఊహించలేనిది. కోహ్లీకి కూడా ఇది బాధగానే అనిపించింది. ఈరోజు ఆటలో టెక్నికల్‌గానూ ఎలాంటి సమస్య కనిపించలేదు. అయినా విఫలమవుతున్నాడు. దాంతో కోహ్లీ కూడా అందరిలాగే విసుగుచెందాడు. ఇక మాకు మిగిలింది ఒక్క మ్యాచే. అందులో చేయాల్సిన పని చాలా ఉంది’ అని బెంగళూరు డైరెక్టర్‌ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో (66), లివింగ్‌స్టోన్‌ (70) దంచికొట్టడంతో పంజాబ్‌ 209/9 స్కోర్‌ సాధించింది. అనంతరం బెంగళూరు 155/9 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ ఆరో స్థానానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని