IND vs USA: ఇండియా VS మినీ ఇండియా.. ఎమోషనల్‌ గేమ్‌: భారత మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ ఇవాళ మరో మ్యాచ్‌ ఆడనుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన యూఎస్‌ఏను ఢీకొట్టనుంది.

Published : 12 Jun 2024 16:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. దాయాదుల పోరు కాబట్టి ఫ్యాన్స్‌ ఆటను ఆస్వాదిస్తారు. టీ20 వరల్డ్‌ కప్‌లో (T20 World Cup 2024) పాక్‌పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్‌ఏతో తలపడేందుకు టీమ్‌ఇండియా (IND vs USA) సిద్ధమైంది. ఇది కూడా ఒకరకంగా భావోద్వేగంతో కూడుకున్నదేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వ్యాఖ్యానించాడు. యూఎస్‌ఏ - భారత్‌ మ్యాచ్‌ కాదు.. ఇండియా vs మినీ ఇండియాగా ఈ పోరును అభివర్ణించాడు. యూఎస్‌ఏ జట్టులో చాలామంది క్రికెటర్లు భారత మూలాలు కలిగినవారు ఉండడం గమనార్హం.

‘‘యూఎస్‌ఏకు ఇది అతిపెద్ద మ్యాచ్‌. ఎందుకంటే వారి ఆటను భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలు చూస్తారు. మైదానంలో వారి ఆటతీరును గమనిస్తూ ఉంటారు. భారత్‌తో మ్యాచ్‌లో నాణ్యమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లపై ప్రశంసలు దక్కుతాయి. ఒకరకంగా ఇది యూఎస్‌ఏకు భావోద్వేగ పోరు. అమెరికాలో క్రికెట్ విస్తరణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ జట్టులో ఇప్పటికే నేను కొందరిని కలిశా. అమెరికాలో ఉన్నప్పటికీ.. భారత్‌ క్రికెటర్లను ఫాలో అవుతామని చాలామంది చెప్పారు. వారి నుంచి స్ఫూర్తి పొందామన్నారు. కొందరు టీమ్‌ఇండియా తరఫున అండర్ -19 క్రికెట్‌ కూడా ఆడారు. ఇప్పుడు యూఎస్‌ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు’’ అని బాలాజీ తెలిపాడు. 

ఆరోన్‌ జోన్స్ ఆత్మవిశ్వాసం అద్భుతం: అశ్విన్

భారత్‌ను ఓడించేందుకు తీవ్రంగా కష్టపడతామని యూఎస్‌ఏ ఆటగాడు ఆరోన్‌ జోన్స్‌ చేసిన వ్యాఖ్యలపై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ స్పందించాడు. ఈసందర్భంగా జోన్స్‌ నమ్మకాన్ని అభినందించాడు. ‘‘ప్రతీ ఆటగాడు ఇలా పోటీనిచ్చేందుకు తహతహలాడాలి. అప్పుడే జట్టులో ఉత్సాహం వస్తుంది. తప్పకుండా ఇలాంటి ప్లేయర్లను అభినందించాలి’’ అని అశ్విన్‌ పోస్టు పెట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని