Tokyo Olympics: రెండోరోజే భారత్‌కు పతకం.. రజతం ముద్దాడిన మీరాబాయి చాను

వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో  పతకం సాధించింది....

Updated : 24 Jul 2021 15:49 IST

కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో  పతకం

టోక్యో: వారెవ్వా..! ఆమె సాధించింది. మీరాబాయి చాను గెలిచింది.. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడింది. భూమ్మీద జరిగే అత్యున్నత క్రీడల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది. ఈ మణిపుర్‌ మణిపూస భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది.

మల్లీశ్వరి తర్వాత..

వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది.

క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తిరుగులేదు

ఈ పోటీల్లో మీరాబాయికి గట్టి పోటీనిచ్చింది చైనా వెయిట్‌ లిఫ్టర్‌ హూ జిహూయి. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది. అయితే పోటీ జరిగినంత సేపూ మీరాబాయి అత్యంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. తనకు పతకం ఖాయమన్న ధీమాతోనే ఆడింది. స్నాచ్‌లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.

115 కిలోలు ఎత్తి ఖాయం చేసేసింది

ఇక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అద్భుతమే చేసింది. ఎందుకంటే ఈ విభాగంలో మీరాకు ప్రపంచంలోనే తిరుగులేదు! మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. మొత్తంగా 202 కిలోలతో భారత్‌కు పతకం అందించింది. పతక ఈవెంట్లు ఉన్న తొలిరోజే రజతం ముద్దాడి.. భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని