PCB: పీసీబీ నిర్ణయం.. పాక్‌ క్రికెట్‌ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్‌ హక్‌

మికీ ఆర్థర్‌ను పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు మరోసారి కోచ్‌గా నియమించాలని పీసీబీ (PCB) నిర్ణయం తీసుకొంది. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. మరికొందరు అభినందించారు. తాజాగా మాజీ కెప్టెన్ మిస్బా ఉల్‌ హక్‌ స్పందించాడు.

Published : 03 Feb 2023 02:25 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై అక్కడి మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిపై పాక్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జాతీయ క్రికెట్ జట్టుకు మిక్కీ ఆర్థర్‌ను కోచ్‌గా తిరిగి నియమించడం ‘పాక్‌ క్రికెట్‌ వ్యవస్థకు ఎదురు దెబ్బ’గా పేర్కొన్నాడు. పీసీబీ చీఫ్‌ నజామ్‌ సేథీ వచ్చిన తర్వాత క్రికెట్‌ జట్టులో పలుమార్పులకు శ్రీకారం చుట్టారు. చీఫ్ సెలక్టర్‌ను తప్పించడంతోపాటు కోచ్‌నూ మార్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మిక్కీ ఆర్థర్‌ను హెడ్‌ కోచ్/డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. అయితే ఆర్థర్‌ ఇప్పుడే అందుబాటులోకి రాలేడు. దీనిపై మిస్బా స్పందించాడు. పీసీబీ క్రికెట్‌ వ్యవస్థ విశ్వసనీయతను పాక్‌ మాజీ ఆటగాళ్లు దెబ్బతీశారని.. అందుకే కోచింగ్‌ బాధ్యతలను అప్పగించడానికి పీసీబీ విదేశీయుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నాడు. 

‘‘ఇది మా పాకిస్థాన్‌ క్రికెట్ వ్యవస్థకు చెంపదెబ్బ. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అత్యుత్తమ కోచ్‌ను నియమించుకోలేకపోతున్నాం. అలాగే నాణ్యమైన క్రికెటర్లు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. వారంతా పాక్‌ను రెండో ఆప్షన్‌గానే చూడటం సరైంది కాదు. నేను మా సొంత క్రికెట్‌ వ్యవస్థనే తప్పుబడుతున్నా. పాక్‌ క్రికెట్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మన క్రికెటర్లను మనమే అగౌరవపర్చుకొనేలా చర్యలకు దిగడాన్ని తప్పుబడుతున్నా. ప్రస్తుతం ఉన్నవారితోపాటు మాజీ ఆటగాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకోరు. మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్ల రేటింగ్‌ కోసం విలువలను, విశ్వసనీయతను దెబ్బతీసుకుంటున్నారు. దీని ఫలితంగా కోచింగ్‌ ఇచ్చేంత సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఇక్కడ లేరనే అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగించారు. ప్రస్తుతం విజయవంతమైన జట్లలో ఒకటైన టీమ్ఇండియా కూడా దేశీయ కోచ్‌ వైపే మొగ్గు చూపింది. అయితే ఇక్కడ మాత్రం పాలసీలు దారుణంగా ఉన్నాయి. మహమ్మద్‌ అక్రమ్, ఆకిబ్‌ జావెద్, ఇంజమామ్‌ ఉల్ హక్, వకార్‌ యూనిస్.. ఇలా చాలామంది అత్యుత్తమ దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరంతా కోచ్‌లుగా పనిచేశారు. కానీ వీరిని ఘోరంగా అవమానించడం బయటకు పంపారు. ఈ బాధ్యతలకు సరైనవారు కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో వచ్చేలా చేయడంలో కొందరు విజయవంతమయ్యారు’’ అని మిస్బా వ్యాఖ్యానించాడు.  

పీసీబీ అప్పగించిన హెడ్ కోచ్‌/డైరెక్టర్‌ బాధ్యతలను చేపట్టడానికి ఆర్థర్‌కు అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థర్‌ డెర్బీషైర్‌ కౌంటీ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఒకవేళ పీసీబీ, కౌంటీ అంగీకరిస్తూ.. రెండు జట్లకూ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అలా కుదరకపోతే మాత్రం అతడు పాకిస్థాన్‌ జట్టుతో కలవలేడు. కానీ ఆన్‌లైన్‌ వేదికగానీ, తన తరఫున మరొక వ్యక్తిని నియమించి కార్యకలాపాలను చూసే అవకాశం లేకపోలేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు