Mitchell Marsh-WORLD CUP: వరల్డ్ కప్‌పై మిచెల్ మార్ష్‌ కాళ్లు.. మీరు మారరంటూ నెట్టింట ట్రోలింగ్‌

వరల్డ్‌ కప్‌ను (ODI World Cup 2023) ఆసీస్‌ నెగ్గినా.. ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం ట్రోఫీకి గౌరవం ఇవ్వడం లేదు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది.

Published : 20 Nov 2023 12:59 IST

(ఫొటో సోర్స్‌: కమిన్స్‌ ఇన్‌స్టా)

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ను (ODI World Cup 2023) ఆస్ట్రేలియా ఆరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్‌లో భారత్‌పై గెలిచి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు మిచెల్ మార్ష్ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రపంచ కప్‌పై అతడు కాళ్లు పెట్టిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. తొలుత ఈ ఫొటోలు ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. ఆ చిత్రంలో వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి సేదతీరుతూ, డ్రింక్‌ తాగుతూ మిచెల్‌ మార్ష్ కనిపించాడు. దీంతో 2006లోనూ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను కాస్త పక్కకు నెట్టిన సంఘటనను అభిమానులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్ని గెలిచినా.. మీ ప్రవర్తనలో మాత్రం మార్పు రాదంటూ విమర్శలు గుప్పించారు.

గతేడాది మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు మెస్సీ ఆ కప్‌ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ తన రూమ్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో మెస్సీకి ఇప్పుడు మిచెల్‌ చేసినదానికి వ్యత్యాసం ఇందంటూ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. 

‘‘అది వరల్డ్‌ కప్‌.. దయ చేసి గౌరవం ఇవ్వండి’’

‘‘విజేతగా నిలవడానికి వారు అర్హులే. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం దారుణం. వారి స్థాయి దిగజారిపోతోంది’’

‘‘ట్రోఫీని గౌరవించకపోతే.. వారు విజేతలుగా నిలిచినా ప్రయోజనం లేదు. మిచెల్‌ మార్ష్‌ నువ్వు చేసిన పనికి సిగ్గుపడాలి’’ 

‘‘దిగ్గజాల నుంచి మిచెల్ చాలా నేర్చుకోవాలి. క్రికెట్ గాడ్ సచిన్‌ చివరి సారిగా వరల్డ్‌ కప్‌ను ముద్దాడిన తీరు ఇప్పటికీ గుర్తుండిపోతుంది’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని