Mitchell Starc: ఆ కారణం వల్లే ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నా: మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు రెండు సీజన్లు (2014, 2015) మాత్రమే ఆడాడు. తర్వాత ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ మెగా లీగ్‌లో ఆడకపోవడానికి గల కారణాన్ని స్టార్క్(Mitchell Starc) తాజాగా వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో రెండు సీజన్లు మాత్రమే ఆడాడు. 2014, 2015 సీజన్లలో ఆర్సీబీ తరఫున ఆడిన స్టార్క్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డే ఉంది. 27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.4 కోట్లకు కొనుగోలు చేసినా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. అప్పటి నుంచి ఏదో ఒక కారణం చెబుతూ ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నాడు. రేపటి (జూన్ 7) నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు దూరంగా ఉండటంపై మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి సారించేందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉంటానని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా డబ్బు బాగా వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు.
‘‘ఆస్ట్రేలియా తరఫున ఆడటం కోసం కొన్ని పనులు చేయకూడదనుకున్నా. లీగ్‌ల్లో ఆడే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. ఐపీఎల్ ఆడటం వల్ల డబ్బు బాగానే వస్తుంది. కానీ, నేను ఆసీస్ తరఫున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా. నేను అక్కడికి చేరుకుంటానో లేదో తెలియదు. కానీ, నేను ఈ నిర్ణయానికే కట్టుబడి ఉన్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ‘‘మూడు ఫార్మాట్లు ఆడుతూ 10 సంవత్సరాలు జట్టుతో ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నా. ఓ ఫాస్ట్‌బౌలర్‌కు ఇది అంత సులువు కాదు. ఆసీస్‌కు మరో మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దొరకగానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతాను’’ అని మిచెల్ స్టార్క్ వివరించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మిచెల్ స్టార్క్ ఆసీస్‌కు కీలకం కానున్నాడు. పేస్‌కు అనుకూలించే ఓవల్ పిచ్‌పై టీమ్ఇండియా బ్యాటర్లను కట్టడి చేయడానికి స్టార్క్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఈ స్టార్ పేసర్‌ను దీటుగా ఎదుర్కొవడానికి భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఎక్కువ పేస్ బౌలింగ్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టార్క్ ఇప్పటివరకు 77 మ్యాచ్‌లు ఆడి 306 వికెట్లు పడగొట్టాడు. 13 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్న అతడు.. 2సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.