T20 World Cup 2024: ఆసీస్‌ ఆక్రోశం మొదలు.. పొట్టి కప్ సూపర్‌-8 షెడ్యూలింగ్‌పై స్టార్క్ వ్యాఖ్యలు!

హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన తమ జట్టు సూపర్-8 స్టేజ్‌ నుంచే బయటకు వచ్చేయడంతో ఆసీస్‌ ఆటగాడు మిచెల్ స్టార్క్‌ అక్కసు వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 11 Jul 2024 16:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) సూపర్‌-8 స్టేజ్‌ నుంచే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్‌, భారత్‌పై ఓడిపోవడంతో ఇంటిముఖం పట్టక తప్పలేదు. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు తనను పక్కన పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc).. సూపర్-8 షెడ్యూలింగ్‌పై, మ్యాచ్‌ సమయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. సీడింగ్‌ ప్రకారం ఒక్కసారిగా తాము ఆడే గ్రూప్‌ మారిపోయిందని పేర్కొన్నాడు. 

‘‘లీగ్‌ స్టేజ్‌లో మేం ఇంగ్లాండ్‌ కంటే ఎక్కువ విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచాం. అయితే, ప్రీసీడింగ్‌తో మేం రెండో జట్టుగా మారిపోయాం. దీంతో మరొక గ్రూప్‌లో సూపర్‌-8 మ్యాచ్‌లను ఆడాల్సి వచ్చింది. వెస్టిండీస్‌ను తట్టుకోవడం చాలా కష్టమని.. మీకు మంచి గ్రూపే వచ్చిందని చాలా మంది వాదిస్తారు. అదంతా సరైన చర్చగా నాకనిపించలేదు. ఇక మా మ్యాచ్‌ల టైమ్‌ను కూడా చూసుకుంటే దారుణం. రెండు నైట్‌ టైమ్‌ మ్యాచ్‌లు, ఒక  డేమ్యాచ్‌ ఆడాం. ఇక అత్యుత్తమంగా మేం సన్నద్ధం కావడానికి అవకాశం ఎక్కడుంది. అప్పటికే మేం సెయింట్‌ విన్సెట్ స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నాం . దాదాపు 90 నిమిషాలపాటు ప్రయాణించి ఎయిర్‌పోర్ట్‌ నుంచి హోటల్‌కు వెళ్లాం. మళ్లీ ఉదయాన్ని 10 గంటలకే టాస్‌. నిర్వాహకులు సరిగ్గా ఏర్పాట్లు చేసినట్లు అనిపించలేదు. సూపర్‌-8లో విండీస్‌ మొత్తం తిరిగి ఆడటం చాలా కష్టం’’ అని తెలిపాడు. 

మేం చేసిన పొరపాటు అదే!

‘‘వరుసగా రెండు వరల్డ్ కప్‌ల్లో అఫ్గాన్-ఆసీస్‌ తలపడ్డాయి. సెయింట్ విన్సెట్ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉందనిపించింది. దీంతో నాకు అవకాశం దక్కలేదు. అస్టన్ అగర్‌ను మేనేజ్‌మెంట్ తీసుకుంది. పవర్‌ప్లేలో అతడు అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. అయితే, అఫ్గాన్ బ్యాటర్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మా ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఫస్ట్‌ బ్యాటింగ్‌ కాస్త ఈజీగా ఉంది. ఆ పరిస్థితులను వారు సద్వినియోగం చేసుకున్నారు. మేం కూడా కాస్త ఫీల్డింగ్‌లో వెనుకబడ్డాం. ఓడిపాలయ్యాం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పరాభవం ఎదురైంది’’ అని స్టార్క్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు