Mithali Raj: క్రికెట్‌కు మిథాలీ రాజ్‌ గుడ్‌బై

భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి .....

Updated : 08 Jun 2022 15:50 IST

దిల్లీ: భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ క్రీడా దిగ్గజం ఓ లేఖను విడుదల చేశారు. ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఏళ్ల పాటు సాగిన తన క్రికెట్‌ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసిందని మిథాలీ తన వీడ్కోలు లేఖలో పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌ జట్టును తీర్చిదిద్దడంలో తన పాత్ర ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్న ఆమె.. అడుగడుగునా తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయమన్న మిథాలీ.. భారత క్రికెట్‌ను ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్ల చేతుల్లో పెడుతున్నానని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ తనపై చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసిన ఈ లెజెండరీ క్రికెటర్‌ 232 వన్డేల్లో 7శతకాలు, 64అర్ధశతకాలతో 7805 పరుగులు చేశారు. 89 టీ20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలతో 699 పరుగులు చేశారు.  దాదాపు రెండు దశాబ్దాల పాటు మహిళల క్రికెట్‌కు మిథాలీ తన అసాధారణ సేవలందించారు. 1999 జూన్‌ 26న తన తొలి మ్యాచ్‌ ఆడిన మిథాలీ.. 2022 మార్చి 27న చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్నారు.

39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు. మిథాలీ రాజ్‌ జీవితం వర్ధమాన క్రికెటర్లకు ఎంతో ఆదర్శం. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మహిళల క్రికెట్లో ఇంకెవరికీ సాధ్యంకాని ఉన్నత శిఖరాలను అధిరోహించారు.  సుమారు 30 ఏళ్లుగా ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా కెరీర్‌ కొనసాగిస్తూ వచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని