Mithali Raj: మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్ర 

టీమ్‌ఇండియా మహిళా జట్టు సారథి మిథాలిరాజ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆమె...

Updated : 04 Jul 2021 13:42 IST

పరుగుల దాహం తీరలేదు: మిథాలి రాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు సారథి మిథాలిరాజ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆమె (75 నాటౌట్‌; 86 బంతుల్లో 8x4) పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు సాధించింది. దాంతో ఇంతకుముందు అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఛార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 10,273 ను టీమ్‌ఇండియా సారథి అధిగమించింది. అయితే, తనకింకా పరుగుల దాహం తీరలేదని.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లోనూ మరింత బాగా ఆడేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పింది. మ్యాచ్‌ అనంతరం వర్చువల్‌లో మిథాలి మీడియాతో మాట్లాడారు.

‘ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడుదొడుకులు.. సవాళ్లు. మధ్యలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నా. కానీ.. ఏదో విషయం నన్ను ముందుకు సాగేలా చేసింది. దాంతో ఇలా 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా. అయితే, ఇప్పటికీ నాకు పరుగులు చేయాలనే దాహం తీరలేదు. టీమ్‌ఇండియాకు మరిన్ని విజయాలు అందించాలనుకుంటున్నా. అలాగే నా బ్యాటింగ్‌లోనూ కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు వాటిమీదే దృష్టిసారించాను’ అని మిథాలి వివరించింది.

ఇక మూడో వన్డేలో తనకు సహకరించిన ఆల్‌రౌండర్‌ స్నేహ రాణా గురించి మాట్లాడుతూ.. ఏడోస్థానంలో ఆమెలాంటి క్రికెటర్‌ గురించే తాము వేచి చూశామని పేర్కొంది. నిన్నటి మ్యాచ్‌లో స్నేహ(24; 22 బంతుల్లో 3x4) బాగా ఆడిందని, ఆమెతో నెలకొల్పిన అర్ధశతక భాగస్వామ్యం చాలా విలువైందని చెప్పింది. ఇక హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ ఫామ్‌ కోల్పోవడంపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని తెలిపింది. అయితే, ఒక జట్టుగా అలాంటి క్రికెటర్లకు అండగా ఉంటామని భరోసా కల్పించింది.

ఇక ఇంగ్లాండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ.. మూడో మ్యాచ్‌లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. రాబోయే టీ20 సిరీస్‌లో మరింత పట్టుదలగా పోరాడేందుకు ఈ విజయం స్ఫూర్తి నింపుతుందని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని