MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో ముంబయి

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో ముంబయి అడుగుపెట్టింది. కీలక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీపై 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 24 Mar 2023 23:05 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో ముంబయి (MIW) ఫైనల్‌కు చేరింది. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ (UPW)ను చిత్తుగా ఓడించి 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాట్‌సీవర్‌ (72) హాఫ్‌సెంచరీతో అదరగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనకు యూపీ.. ముంబయి బౌలర్ల ధాటికి చతికిలపడిపోయింది. 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కిరణ్‌ నవగిరె (43) తప్ప ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో యూపీ పరాజయం పాలైంది. ముంబయి బౌలర్లలో ఇసే వాంగ్‌ (4) హ్యాట్రిక్‌ వికెట్లు తీసింది.సైకా ఇషాక్‌ 2 వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్‌, హేలీ మ్యాథ్యూస్‌, కలిత తలో వికెట్‌ తీశారు. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం దిల్లీతో ముంబయి తలపడనుంది.

లక్ష్య ఛేదనకు దిగిన యూపీకి ముంబయి బౌలర్‌ వోంగ్‌ (15/4) తీవ్రంగా దెబ్బకొట్టింది. నాలుగు కీలకమైన వికెట్లు వికెట్లు తీసి యూపీ జట్టు పతనానికి నాంది పలికింది. బ్యాటింగ్‌ ప్రారంభించిన యూపీ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయలేకపోయింది.  ఓపెర్‌ అలీసా హీలీ (11) తీవ్ర నిరాశపరిచింది. వోంగ్‌ వేసిన రెండో ఓవర్‌ చివరి బంతికి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. అక్కడికి రెండు బంతుల వ్యవధిలోనే మరో ఓపెనర్‌ షెహ్రావత్‌ (1)కూడా ఇషాక్‌ బౌలింగ్‌లో మ్యాథ్యూస్‌కు క్యాచ్‌ ఇచ్చింది. తొలిడౌన్‌లో వచ్చిన కిరణ్‌ నవగినే (43; 27 బంతుల్లో 4×4,3×6) ఒంటరి  పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. తాలియా మెక్‌గ్రాత్‌ (7), గ్రేస్‌ హారిస్‌ కూడా (14) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 13వ ఓవర్‌ వేసిన ఇషాక్‌ వేసిన  84 పరుగుల వద్ద హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టింది. దీంతో జట్టు పూర్తిగా కష్టాల్లోకి పడిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. అతికష్టంమీద 17.4ఓవర్ల వరకు మ్యాచ్‌ను నెట్టుకొచ్చిన యూపీ.. 110 పరుగులు చేసి ఆలౌటయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని