Tokyo Olympics: తలెత్తుకునేలా చేశారు.. బాధపడకండి..!

అద్భుతం సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయినప్పటికీ.. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి దేశ ప్రజల మనసులు గెల్చుకుంది. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు కూడా వారికి ఇవే మాటలు చెప్పి ఓదార్చారు. మీరు ముందు తరాలకు ఆదర్శమని కొనియాడారు. 

Updated : 06 Aug 2021 13:42 IST

మహిళల హాకీ జట్టు పోరాట పటిమను కొనియాడుతున్న ప్రముఖులు

దిల్లీ: అద్భుతం సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయినప్పటికీ.. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి దేశ ప్రజల మనసులు గెల్చుకుంది. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు కూడా వారికి ఇవే మాటలు చెప్పి ఓదార్చారు. ముందు తరాలకు వీరు ఆదర్శమని వారిని కొనియాడారు.

భారత మహిళల హాకీ జట్టు మైదానంలో అద్భుతంగా రాణించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాన్ని గెల్చుకుందని, చాలా గర్వంగా ఉందని ఆయన ట్విటర్‌లో స్పందించారు.

ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారంటూ ప్రధాని మోదీ కొనియాడారు. ‘టోక్యో ఒలింపిక్స్‌లో మీరు ఆడిన తీరు ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అత్యుత్తమంగా పోరాడారు. ప్రతి ఒక్కరు గొప్ప తెగువ, నైపుణ్యాల్ని కనబర్చారు. మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోంది. పతకాన్ని కోల్పోయినప్పటికీ.. హద్దుల్ని చెరిపేశారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు హాకీ స్టిక్‌ పట్టుకునేందుకు ప్రేరణగా నిలిచారు’ అని ప్రధాని ప్రశంసించారు.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ..‘ బాధాకరమే!! కానీ మీ ప్రదర్శనతో తలెత్తుకునేలా చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి నిచ్చారు. అది కూడా విజయమే’ అంటూ ఓదార్చారు. మరోపక్క మన వాళ్లు చూపిన పోరాట పటిమను గ్రేట్ బ్రిటన్ హాకీ పొగిడింది. ‘అద్భుతమైన ఆట. అంతే అద్భుతమై ప్రత్యర్థి. టోక్యో ఒలింపిక్స్‌లో మీరు ప్రత్యేకంగా నిలిచారు’ అంటూ అభినందనలు తెలిపింది.

మంత్రి కేటీఆర్ ప్రశంసలు..

‘అద్భుతంగా పోరాడిన మహిళల హాకీ బృందానికి అభినందనలు. మీ పోరాట స్ఫూర్తితో దేశ ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ప్రపంచ వేదికపై పోటీలో నిల్చేందుకు ఆడపిల్లలకు ప్రేరణగా నిల్చారు’ అని కేటీఆర్‌ ప్రశంసించారు.

ఈ రోజు కాంస్యం కోసం జరిగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్‌కు గట్టిపోటీనిచ్చి, భారత్‌ ఆఖరువరకు పోరాడింది. అయితే కీలక సమయాల్లో పొరపాట్లు చేయడం, పీసీలను గోల్స్‌గా మలచకపోవడంతో టీమ్‌ఇండియా విజయానికి దూరమైంది. బ్రిటన్‌పై 4-3 తేడాతో పరాజయం చవిచూసింది.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని