
మొయిన్ అలీ అలా అడగలేదు
దిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ కోసం కొత్తగా రూపొందించిన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తన కోసం తీసేయాలని ఆ జట్టు ఆటగాడు మొయిన్ అలీ కోరినట్లు వస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సీఎస్కే యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని, అలీ అలా అడగలేదని సీఎస్కే స్పష్టం చేసింది. ‘‘తన జెర్సీ పైనుంచి ఎలాంటి లోగోను తీసేయమని అలీ సీఎస్కేను కోరలేదు’’ అని దాని సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించాడు. కెప్టెన్ ధోని సారథ్యంలో ఆడడంతో తమ ఆట మెరుగైందని చాలా మంది ఆటగాళ్లు తనతో అన్నారని ఇటీవల అలీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో అలీ కోసం సీఎస్కే రూ.7 కోట్లు చెల్లించింది. ఐపీఎల్లో ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లాడిన అలీ 309 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. 2010 ఐపీఎల్లో అప్పటి దిల్లీ డేర్‌డేవిల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యూసుఫ్ పఠాన్ తన జెర్సీపై ఉన్న కింగ్‌ఫిషర్ లోగోపై టేప్ అంటించుకుని మైదానంలో దిగాడు.