SA vs IND: కేఎల్.. ఇక నువ్వు మాట్లాడకు.. నీ బ్యాటే సమాధానం ఇచ్చింది: కైఫ్‌

కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుత శతకంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా కేఎల్‌ను అభినందిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు.

Published : 28 Dec 2023 18:04 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడం సులువైన విషయం కాదు. కానీ, భారత మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ మాత్రం ఆ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (101) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. జట్టు క్లిష్టపరిస్థితుల్లో అద్భుతమైన శతకం సాధించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. గత వరల్డ్‌ కప్‌ ముంగిట వరకు అతడిని అనవసరంగా జట్టులో కొనసాగిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటికి తన బ్యాటింగ్‌తోనే సమాధానం చెప్పినట్లు అయిందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. కేఎల్ సెంచరీని అభినందిస్తూ కైఫ్‌ ఓ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. 

‘‘క్లిష్టమైన పిచ్‌పై.. క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ వచ్చి సెంచరీ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. విదేశాల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలంటే ఎంతో ఓపిక, సహనం అవసరం. బంతి ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజ్‌లో పాతుకుపోయి సెంచరీ సాధించాడు. చరిత్రలో నిలిచిపోయే శతకం అది. కేఎల్‌.. ఇక నుంచి నువ్వు మాట్లాడటం ఆపేయ్‌. నీ బ్యాటే మాట్లాడుతుంది. భారత్‌ నుంచి మ్యాచ్‌ పూర్తిగా చేజారిపోయే సమయంలో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం చిరస్మరణీయం. టెస్టు క్రికెట్‌కు అసలైన అర్థం ఇదే. కేఎల్‌ రాహుల్‌ అద్భుతం’’ అని కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని