Bumrah: బుమ్రా గాయంపై స్పష్టత ఎక్కడ?: మహమ్మద్ కైఫ్‌

ఆరేడు నెలల నుంచి క్రికెట్‌కు దూరమైన బుమ్రా (Bumrah) గాయం పరిస్థితిపై ఇప్పటి దాకా ఓ స్పష్టమైన వివరణ ఎన్‌సీఏ నుంచి రాలేదు. దీనినే టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ ప్రశ్నించాడు.

Published : 15 Apr 2023 22:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది సెప్టెంబర్‌ నుంచి గాయం కారణంగా టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ ఆడటం లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీలో (NCA) విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ ఎన్‌సీఏ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రా గాయంపై సరైన సమాచారం అందించడంలో ఎన్‌సీఏ విఫలమైందని, పారదర్శకత లోపించిందని విమర్శించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో కీలక ఆటగాడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 

‘‘ఎన్‌సీఏ వ్యవస్థలో పొరపాట్లు జరుగుతున్నట్లు నాకు అనిపిస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్, అతడి టీమ్‌ పరిస్థితులను అదుపులో ఉంచాలి. బుమ్రా త్వరగా బరిలోకి దిగాలని కోరుకునే అభిమానులను నిరాశపరచడం సరైంది కాదు. ఇది చాలా సీరియస్‌ విషయం. దీనిపై మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టాలి. ఎన్‌సీఏలో ప్రతి విషయంపైనా పారదర్శకత ఉండాలి. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారో లేదో అనే దానిపై సరైన విధానంలో పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించాలి. ప్లేయర్ ఫిట్‌గా ఉన్నాడా.. లేదా..? మరో పది నుంచి 20 రోజుల విశ్రాంతి అవసరమా..? అనేది తేల్చాలి. బుమ్రా అభిమానిగా.. అతడు ఎప్పుడు మైదానంలోకి దిగుతాడు? ఎలాంటి గాయం అయింది? గాయం నుంచి కోలుకోవడానికి ఇంకెంతకాలం పడుతుంది? అనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది. వీటన్నింటిపై ఎన్‌సీఏ పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని కైఫ్‌ తెలిపాడు. గతేడాది ఆసియా కప్‌తో సహా ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ బుమ్రా పాల్గొనలేకపోయాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే అతడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నట్లు అప్పట్లో బీసీసీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని