Mohammad Rizwan: ప్రపంచంలోనే అత్యంత కఠినమైంది పాకిస్థాన్‌ లీగ్‌ : మహమ్మద్‌ రిజ్వాన్‌

ఒకప్పుడు అంతా భారత టీ20 లీగ్‌ గురించే మాట్లాడుకునేవారని.. పాకిస్థాన్‌ లీగ్‌ ఆ పరిస్థితులను మార్చేసిందని మహమ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan) అన్నాడు. 

Published : 18 Dec 2022 11:50 IST

కరాచీ: పాక్‌ నిర్వహిస్తున్న లీగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని పాక్‌ స్టార్‌బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan) పేర్కొన్నాడు. భారత్‌లోని లీగ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లీగ్‌ల ప్రస్తావన వస్తే ఒకప్పుడు అంతా భారత టీ20 లీగ్‌(T20 League) గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలోనే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ అత్యంత కఠినమైందిగా నిలిచింది. ఒకసారి పాకిస్థాన్‌ లీగ్‌లో ఆడితే ఎవరైనా ఇదే మాట అంటారు. ఎందుకంటే మా లీగ్‌లో బెంచ్‌పై రిజర్వ్‌ ఆటగాళ్లు సైతం అద్భుతంగా ఆడగలరు. మా లీగ్‌ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యపరిచింది. ప్రారంభ రోజుల్లో మా దేశంలో ఇది విజయవంతం కాదని చాలా మంది అన్నారు. కానీ, ఇప్పుడు దీనికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి’’అని రిజ్వాన్‌ పేర్కొన్నాడు. 

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఎనిమిదో ఎడిషన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు కరాచీ, ముల్తాన్‌, రావల్పిండి, లాహోర్‌ వేదికలు కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చ్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు రమీజ్‌ రజా మాట్లాడుతూ తమ లీగ్‌ ఆదాయ వివరాలు వెల్లడించాడు. ఈ సీజన్‌లో లాభాలు 71 శాతం పెరిగాయని, టోర్నమెంట్ చరిత్రలోనే ఇదే అత్యధికమని తెలిపాడు. ఇందులో ఒక్కో ఫ్రాంఛైజీ దాదాపు రూ. 38 కోట్లు ఆర్జించిందని తెలిపాడు. లీగ్‌ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంపై హర్షం వ్యక్తం చేశాడు. లాహోర్‌ నుంచి ఈ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును తన జీవితంలో చూడలేదని తెలిపాడు. 

పాకిస్థాన్‌ క్రికెట్‌లో రెండేళ్లుగా మహమ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan) కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ 2 బ్యాటర్‌ స్థానాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, బిగ్‌ బాష్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ వంటి టోర్నీలను కూడా ఆడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని